Best Actors of 21st century: 21వ శతాబ్దం బెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. లిస్టులో ఉన్న ఏకైక ఇండియన్ యాక్టర్ ఇతడే
Best Actors of 21st century: ఈ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా? 60 మందితో రూపొందిన ఈ జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ యాక్టర్ కు చోటు లభించింది. ది ఇండిపెండెంట్ ఈ జాబితాను తయారు చేసింది.
Best Actors of 21st century: 21వ శతాబ్దం మొదలై 24 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యాక్టర్స్ ఎవరు అన్నదానిపై ది ఇండిపెండెంట్ ఓ 60 మందితో కూడిన జాబితాను తయారు చేసింది. 2000 ఏడాది తర్వాత రిలీజైన సినిమాలను పరిగణనలోకి తీసుకొని ఈ లిస్ట్ తయారు చేసింది. అయితే ఇందులో ఒకే ఒక్క ఇండియన్ యాక్టర్ కు మాత్రమే చోటు దక్కడం గమనార్హం.
బెస్ట్ యాక్టర్స్.. ఆ ఇండియన్ ఇతడే..
ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, షారుక్, ఆమిర్ ఖాన్ లాంటి ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. అయితే ది ఇండిపెండెంట్ రిలీజ్ చేసిన బెస్ట్ 60 యాక్టర్స్ లిస్టులో వీళ్లెవరికీ చోటు దక్కలేదు. ఇండియా నుంచి ఉన్న ఏకైక నటుడు ఇర్ఫాన్ ఖాన్ కావడం విశేషం. అతనికి కూడా 41వ స్థానం దక్కింది. 2020లో కన్నుమూసిన ఈ నటుడు బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి దశాబ్దానికి పైగా కష్టపడ్డాడు.
2001లో వచ్చిన ది వారియర్ మూవీ ద్వారా సక్సెస్ అందుకున్న ఇర్ఫాన్.. తర్వాత విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు. హాసిల్, మక్బూల్, ది నేమ్‌సేక్, లైఫ్ ఇన్ ఎ మెట్రో, స్లమ్‌డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమార్, లైఫ్ ఆఫ్ పై, ది లంచ్‌బాక్స్, హైదర్, పీకూ, హిందీ మీడియం, అంగ్రేజీ మీడియంలాంటి సినిమాల్లో ఇర్ఫాన్ ఖాన్ నటించాడు.
ఇర్ఫాన్ తన కళ్లతోనే నటించగలడని, తన పెదాల కదపకుండా కవిత్వాన్ని అవి చెప్పగలవని ది ఇండిపెండెంట్ ఈ సందర్భంగా వర్ణించడం విశేషం. పలు హిందీ సినిమాల్లో నటనకుగాను ఇర్ఫాన్ కు ఎంతో గుర్తింపు లభించింది. అతడు 2020లో క్యాన్సర్ తో మరణించాడు.
ది ఇండిపెండెంట్ టాప్ 10 యాక్టర్స్ వీళ్లే
ఈ 21వ శతాబ్దపు బెస్ట్ యాక్టర్స్ జాబితాలో ఇప్పటికే కన్నుమూసిన మరో నటుడికి కూడా చోటు దక్కింది. అంతేకాదు అతడే నంబర్ వన్ ర్యాంకులో ఉండటం గమనార్హం. ఈ నటుడి పేరు ఫిలిప్ సేమౌర్ హాఫ్‌మాన్. 2014లో 46 ఏళ్ల వయసులో అతడు చనిపోయాడు. ఇక అతని తర్వాత రెండో స్థానంలో నటి ఎమ్మా స్టోన్ నిలిచింది.
మూడో స్థానంలో డేనియల్ డే-లూయిస్, నాలుగో స్థానంలో డెంజెల్ వాషింగ్టన్, ఐదో స్థానంలో నికోల్ కిడ్‌మన్, ఆరో స్థానంలో డేనియల్ కలూయా, ఏడో స్థానంలో సాంగ్ కాంగ్ హో, ఎనిమిదో స్థానంలో కేట్ బ్లాంచెట్, 9వ స్థానంలో కొలిన్ ఫారెల్, 10వ స్థానంలో ఫ్లోరెన్స్ ప్యూ నిలిచారు.