Ind vs Aus Test Venue Change: భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మారింది.. ధర్మశాల నుంచి మార్పు
Ind vs Aus Test Venue Change: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు వేదికను మార్చింది బీసీసీఐ. ధర్మశాలలో జరగాల్సిన ఈ వేదికను శీతాకాలం కారణంగా తరలిస్తున్నట్లు ప్రకటించింది.
Ind vs Aus Test Venue Change: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టును టీమిండియా గెలిచింది. రెండో టెస్టు దిల్లీలో.. మూడో టెస్టు ధర్మశాల వేదికగా జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే ధర్మశాల వేదికగా జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారింది. ధర్మశాలలోని హెచ్‍పీసీఏ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడదని, అందుకే వేదికను మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాల నుంచి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియానికి మూడో టెస్టు వేదికను మారుస్తున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు మూడో టెస్టు జరగనుంది.
"ధర్మశాల ప్రాంతంలో శీతాకాలంలో కఠినమైన పరిస్థితుల కారణంగా అవుట్ ఫీల్డ్‌లో తగినంత గడ్డి లేదు. అంతేకాకుండా పూర్తిగా అభివృద్ధి చెందడానికి కొంతసమయం పడుతుంది." అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.
ధర్మశాల వేదికగా చివరగా 2016-17 బోర్డర్-గవాస్కర్ సీజన్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. స్టీవ్ స్మిత్ సారథ్యంలో టీమిండియా చివరి మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. హెచ్‌పీసీఏ స్టేడియం ఆతిథ్యమిచ్చిన ఏకైక టెస్టు మ్యాచ్ ఇదే. ఇది కాకుండా ఐదు వన్డేలు, 11 టీ20లకు ఆతిథ్యమిచ్చింది.
ఇండోర్ విషయానికొస్తే ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేకు ఆతిథ్యమిచ్చింది ఈ స్టేడియం. శుబ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో మోత మోగించారు. ఫలితంగా భారత్ 90 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 2016లో తొలి సారిగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియంలో 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో టెస్టును చివరగా నిర్వహించారు. 2006 నుంచి ఇప్పటి వరకు అక్కడ 6 వన్డేలు, 7 టీ20లు నిర్వహించారు.
సంబంధిత కథనం