Bazooka Teaser: మెగాస్టార్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. అదిరిపోయిన టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే?
Bazooka Teaser: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గురువారం (ఆగస్ట్ 15) రిలీజైంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కానుంది.
Bazooka Teaser: మెగస్టార్ మమ్ముట్టి అసలు ఏమాత్రం స్పీడు తగ్గించడం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ సరికొత్త జానర్ సినిమాలతో అలరిస్తున్నాడు. అతడు తాజాగా నటిస్తున్న మూవీ బజూకా. ఇదొక గేమ్ థ్రిల్లర్ మూవీ. గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా నటిస్తున్న ఈ సినిమా టీజర్ గురువారం (ఆగస్ట్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బజూకా మూవీ టీజర్
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న బజూకా మూవీని డీనో డెన్నిస్ డైరెక్ట్ చేశాడు. అతనికిదే తొలి సినిమా కావడం విశేషం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాక్షన్ గేమ్ థ్రిల్లర్ మూవీలో మమ్ముట్టి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. 100 సెకన్ల ఈ వీడియోలో గౌతమ్ మేనన్.. ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా.. మమ్ముట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించడం చూడొచ్చు.
అయితే అతని పాత్ర గురించి టీజర్ లో రివీల్ చేయలేదు. ఈ టీజర్ లో మమ్ముట్టి ఓ పోనీ టెయిల్ వేసుకొని, వింటేజ్ కారులో వచ్చి ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మమ్ముట్టి పాత్ర ఇదేనా?
బజూకా టీజర్ చూస్తుంటే గౌతమ్ మేనన్ ఓ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించినట్లు తెలుస్తున్నా.. మమ్ముట్టి పాత్ర గురించి ఏమీ తెలియలేదు. అయితే అతడు ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్ వినీత్ మేనన్ పాత్ర ఈ సినిమాలో పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఇద్దరితోపాటు మూవీలో జగదీశ్, సిద్ధార్థ్ భరతన్, సన్నీ వేన్, షైన్ టామ్ చాకో, ఐశ్వర్య మేనన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. మిథున్ ముకుందన్ మ్యూజిక్ అందించాడు.
మమ్ముట్టి దూకుడు
ఐదు దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్ మమ్ముట్టి మూడేళ్లుగా దూకుడు పెంచాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. 2024లో మమ్ముట్టి నటించిన నాలుగో సినిమా ఈ బజూకా కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే అబ్రహం ఓజ్లర్, భ్రమయుగం, టర్బో సినిమాలు చేశాడు.
ఇక మమ్ముట్టి 2022లో ఐదు సినిమాలు, 2023లో నాలుగు సినిమాలు చేయడం గమనార్హం. 2022లో భీష్మ పర్వం, సీబీఐ5: ది బ్రెయిన్, పురు, ప్రియన్ ఒట్టాతిలను, రోర్షాలాంటి మూవీస్ చేయగా.. గతేడాది నన్పకల్ నేరతు మాయక్కం, క్రిస్టొఫర్, కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్ మూవీస్ లో నటించాడు.