వెరైటీ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ మలయాళంలో వరుస విజయాలు అందుకుంటున్నాడు బాసిల్ జోసెఫ్. అతడు హీరోగా నటించిన తాజా మూవీ మరణమాస్ సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ డార్క్ కామెడీ మూవీని మలయాళ హీరో టోవినో థామస్ నిర్మించడం గమనార్హం. మరణ మాస్ ఎలా ఉందంటే?
కేరళలోని ఓ ఊళ్లో వృద్ధులను టార్గెట్ చేస్తూ దారుణంగా హత్యలు చేస్తుంటాడు సీరియల్ కిల్లర్ రిప్పర్. బ్లేడ్‌తో మొహం అంతా చెక్కేసి...నోట్లో అరిటిపండు పెట్టి చంపడం సంచలనంగా మారుతుంది. ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే బాధ్యతను పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ చేపడతాడు.
సీరియల్ కిల్లర్ కారణంగా ఊరు మొత్తం వణికిపోతుంది. జెస్సీ ఓ కిక్ బాక్సర్. ల్యూక్ అమెను ప్రేమిస్తాడు. ల్యూక్‌ను సీరియల్ కిల్లర్‌గా పోలీసులు అనుమానించడంతో అతడికి బ్రేకప్ చెబుతుంది. కిక్ బాక్సింగ్ కోచింగ్ నుంచి జెస్సీ ఇంటికొస్తుండగా బస్‌లో ఆమెతో కేశవ కురుప్ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు.
అతడి ముఖంపై పెప్పర్ స్ప్రే కొడుతుంది జెస్సీ.ఆ పెప్పర్ స్ప్రే కారణంగా కేశవ బస్‌లోనే చనిపోతాడు. ఆ బస్‌లో డ్రైవర్ జిక్కు, కండక్టర్ అరువితో పాటు శ్రీకుమార్ మాత్రమే ఉంటారు. డబ్బులు తీసుకొని కేశవ డెడ్‌బాడీని తాను మాయం చేస్తానని జెస్సీకి మాటిస్తాడు శ్రీకుమార్. అనుకోకుండా ల్యూక్ ఆ బస్‌లోకి ఎక్కుతాడు. డెడ్ బాడీని మాయం చేసే క్రమంలో శ్రీకుమార్ సీరియల్ కిల్లర్ అనే నిజం బయటపడుతుంది.
ఆ తర్వాత ఏమైంది? శ్రీకుమార్ బారి నుంచి తప్పించుకోవడానికి జెస్సీ, అరువి, జిక్కుతో పాటు ల్యూక్ ఏం చేశారు? తనపై పడిన సీరియల్ కిల్లర్ ముద్ర నుంచి ల్యూక్ బయటపడ్డాడా? ల్యూక్‌ను చంపాలని శ్రీకుమార్ ఎందుకు అనుకున్నాడు? ఆ కిల్లర్ బారి నుంచి లవర్‌ను జెస్సీ ఎలా కాపాడుకుంది అన్నదే ఈ మూవీ కథ.
సాధారణంగా సీరియల్ కిల్లర్ మూవీస్ ట్విస్ట్‌లు, టర్న్‌లతో థ్రిల్లింగ్‌గా సాగుతుంటాయి. ఇలాంటి సినిమాల్లో హింస, రక్తపాతం ఎక్కువే ఉంటుంది. ఈ రొటీన్ ఫార్ములాకు భిన్నంగా మరణ మాస్ మూవీ సాగుతుంది. సినిమాలో ఎక్కడ సీరియస్‌నెస్ అన్నది కనిపించదు. కిల్లర్ చేసే మర్డర్స్ నుంచి హీరో లవ్ ట్రాక్ వరకు ప్రతీదీ ఫన్నీగానే ఉంటుంది.
సినిమాలోని క్యారెక్టర్స్ ఒక్కొక్కటిగా ఓ రేంజ్ బిల్డప్పులతో స్క్రీన్‌పైకి ఎంట్రీ వస్తాయి. పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ ఫస్ట్ సీన్‌లో చైన్ పట్టుకొని ఇంటెన్స్‌గా కనిపిస్తాడు. కిల్లర్స్ పాలిట సింహస్వప్నం అంటూ అతడి గురించి ఎలివేషన్లు ఇస్తారు.
ఆ వెంటనే కుక్క మిస్సయ్యిందని అతడు కన్నీళ్లు పెట్టుకోవడం నవ్విస్తుంది. హీరోతో పాటు బస్ డ్రైవర్ పాత్రను అలాగే పరిచయం చేయడం ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటికి ఓ సెఫరేట్ ట్రాక్ పెట్టడం... ఆ ఎమోషన్‌ను కథలో కలిసిపోయేలా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
హీరోయిన్ చేతిలో చనిపోయిన వృద్ధుడు కండక్టర్ తండ్రి అని బయటపడటం లాంటి ట్విస్ట్‌లు మెప్పిస్తాయి. ఈ సినిమా చాలా వరకు బస్ జర్నీలోనే కేవలం ఐదు పాత్రలోనే సాగుతుంది. సీరియల్ కిల్లర్ వారిని ఏం చేస్తాడో ఓ టెన్షన్‌ను బిల్డ్ చేస్తూనే న వ్వించాడు డైరెక్టర్. ముఖ్యంగా బస్ డ్రైవర్ జిక్కు రొమాంటిక్ ట్రాక్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యింది.
అతడు ఉన్న సిట్యూవేషన్‌తో సంబంధం లేకుండా తనతో మాట్లాడమని కాబోయే భార్య పోరు పెట్టడం, ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే ప్రస్టేషన్ నవ్విస్తాయి. కనిపించిన వారిని తన పెళ్లికి పిలిచే తీరు నవ్విస్తుంది. చనిపోయింది తన తండ్రే అనుకున్న అరువికి చివరలో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అది కూడా హిలేరియస్‌గా కామెడీని పంచుతుంది.
సెకండాఫ్ చాలా వరకు సాగతీతగా అనిపిస్తుంది. స్మశానం ఎపిసోడ్‌లో కామెడీ అంతగా పండలేదు. కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు, అతడి మోటీవ్ ఏమిటనే ఫ్లాష్‌బ్యాక్ సినిమాలో కనిపించదు.
బాసిల్ జోసెఫ్ మరోసారి తన యాక్టింగ్‌తో ఇరగదీశాడు. సినిమాలో అతడి లుక్కే డిఫరెంట్‌గా ఉంటుంది. అతడి డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్‌తో కడుపుబ్బా నవ్విస్తాయి. బాసిల్ జోసెఫ్ తర్వాత డ్రైవర్‌గా సురేష్ కృష్ణ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. జెస్సీగా అనీషా నటన ఓకే. సీరియల్ కిల్లర్ పాత్రకు రాజేష్ మాధవన్ న్యాయం చేశాడు. అమాకంగా కనిపించే విలన్ పాత్రలో వేరియేషన్స్ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా బాబ్ ఆంటోనీ నటన బాగుంది.
మరణ మాస్ నవ్విస్తూనే థ్రిల్లింగ్‌ను పంచే సీరియల్ కిల్లర్ మూవీ. కొత్త తరహా సినిమాలను కోరుకునే ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుంది.
సంబంధిత కథనం