Barroz OTT Release Date: రూ.150 కోట్ల బడ్జెట్.. 20 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మోహన్‌లాల్ డిజాస్టర్ మూవీ
Barroz OTT Release Date: ఓటీటీలోకి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన డిజాస్టర్ మూవీ వస్తోంది. ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.20 కోట్లు మాత్రమే వచ్చాయి.
Barroz OTT Release Date: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి గతేడాది ఎన్నో బ్లాక్‌బస్టర్స్ వచ్చినా.. అదే స్థాయిలో డిజాస్టర్ సినిమాలూ ఉన్నాయి. అందులో ఒకటి మోహన్ లాల్ తొలిసారి డైరెక్ట్ చేసిన బరోజ్ (Barroz). ఈ మూవీ గతేడాది డిసెంబర్ 25న రిలీజైంది. ఇప్పుడీ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గురువారం (జనవరి 16) వెల్లడించింది. మలయాళం సహా ఐదు భాషల్లో మూవీ స్ట్రీమింగ్ కానుంది.
బరోజ్ ఓటీటీ రిలీజ్
మోహన్ లాల్ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న మూవీ బరోజ్. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పుడీ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు హాట్‌స్టార్ తెలిపింది.
"బరోజ్: ది గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్ మ్యాజిక్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతోంది" అనే క్యాప్షన్ తో హాట్‌స్టార్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపింది. అయితే మూవీ స్ట్రీమింగ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ లెక్కన నెల రోజుల్లోపే మూవీ డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో మూవీ స్ట్రీమింగ్ కానుంది.
బరోజ్ మూవీ గురించి..
మోహన్ లాల్ మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా "బరోజ్ 3డీ: గార్డియన్ ఆఫ్ ట్రెజరర్". ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన బరోజ్ సినిమాను త్రీడీలో రూపొందించారు. మోహన్ లాల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన బరోజ్ 3డి చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్ గ్రాండ్‌గా నిర్మించారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషించిన బరోజ్ మూవీని గ్రాండ్‌గా రూ. 150 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరించారు. సినిమా కథ నచ్చడంతో మోహన్ లాల్ స్వయంగా డైరెక్షన్ చేయడం విశేషం. గతేడాది డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే అన్ని భాషల్లోనూ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో వచ్చే నెలలో ఓటీటీలోకి వస్తుందని భావించిన ఈ మూవీ.. చాలా ముందుగానే వచ్చేస్తోంది.