Hero Murder: హీరో, నిర్మాతను కొట్టి చంపిన జనాలు- కలిసి మరణించిన తండ్రీకొడుకులు- హింసాత్మకంగా దేశ పరిస్థితి
Bangladesh Producer And His Son Hero Shanto Khan Murder: ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి మరింత హింసాత్మకంగా మారుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌లోని నిర్మాత సలీం ఖాన్, ఆయన కుమారుడు, హీరో షాంటో ఖాన్‌ను నిరసనకారులు కొట్టి చంపేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bangladesh Actor Producer Murder: ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో దారుణమైన పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. ఎక్కడ చూసిన నిరసనకారులు ఆందోళనలు, అల్లర్లు చెలరేగిపోతున్నాయి. రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం కాస్తా చినికి చినికి పెద్ద తుఫాన్‌లా మారింది.
రిజర్వేషన్ల వివాదం చివరికీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్నే విడిచిపెట్టే పారిపోయేంత స్టేజ్‌కు చేరింది. ప్రధాని దేశాన్ని విడిచిపెట్టి పోవడంతో అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తకరంగా మారిపోయాయి. అల్లరిమూకలు, నిరసనకారులు చెలరేగిపోతూ బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రధాని అధికారిక నివాసంలోని వస్తువులను నిరసనకారులు పట్టుకెళ్లిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో మరో దారుణమైన ఘనట చోటుచేసుకుంది. బంగ్లా అల్లర్లలో అక్కడి ప్రముఖ హీరోతోపాటు అతని తండ్రి నిర్మాత చనిపోయారు. దాంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బంగ్లాదేశ్‌లోని సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు రూపొందించి నిర్మాత ప్రముఖ గుర్తింపు తెచ్చుకున్నారు సలీం ఖాన్. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆయన తన కుమారుడు షాంటో ఖాన్‌ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు.
ఆ తండ్రీకొడుకులను తాజాగా బంగ్లాలోని అల్లరి మూకలు దారుణంగా చంపేశాయి. బంగ్లాదేశ్ మీడియా ప్రకారం అల్లరి మూకల దాటికి సోమవారం (ఆగస్ట్ 5) సాయంత్రం చాంద్‌పూర్ ప్రాంతం నుంచి తండ్రీకొడుకులు సలీం ఖాన్, షాంటో ఖాన్ పారిపోయారు. కానీ, బలియా యూనియన్‌లోని ఫరక్కాబాద్ మార్కెట్‍లో వీళ్లిద్దరిని ప్రజలు చుట్టుముట్టారు. హీరో, నిర్మాతపై జనాలు ఆగ్రహానికి గురయ్యారు.
ఈ సమయంలో పిస్టల్ పేల్చి ఇద్దరు తండ్రీకొడుకులు తప్పించుకున్నారు. కానీ, ఆ ప్రాంతానికి దగ్గర్లోని బగారా మార్కెట్‌కు వచ్చేసరికి జనాలు మరింత భారీగా పోగయ్యారు. దాంతో ఎటు వెళ్లలేక అక్కడే చిక్కుపోయారు సలీం ఖాన్, షాంటో ఖాన్. అప్పుడు ఆవేశంతో రగిలిపోయిన జనాలు వీళ్లిద్దరిని కొట్టి చంపేశారు. దాంతో తండ్రీకొడుకులు కలిసి ఒకేసారి మరణించారు.
ఇదిలా ఉంటే, పలు చిత్రాల నిర్మాణంతో పేరు తెచ్చుకున్న సలీం ఖాన్ అక్కడి అగ్ర నటీనటులతో సినిమాలు తెరకెక్కించారు. దాదాపుగా పది సినిమాలకు సలీం ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆయన కుమారుడు షాంటో ఖాన్ బాబుజాన్ (2023), ఆంటోనగర్, తుంగిపరార్ మియా భాయ్ (2021) సినిమాల్లో నటించాడు.
సలీం ఖాన్, అతని కుమారుడు షాంటో ఖాన్ మరణంపై నటుడు దేవ్ రియాక్ట్ అయ్యారు. నిన్న రాత్రి నాకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. "సలీం చనిపోయారనే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బంగ్లాదేశ్‌లో శాంతి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను" అని తన ఆవేదనం వ్యక్తం చేశారు నటుడు దేవ్.