Balakrishna: స్టేజీపై శ్రీలీలతో కలిసి స్టెప్పులేసిన బాలకృష్ణ: వీడియో.. విగ్ విషయంలో ఫ్లాష్‍బ్యాక్ గుర్తుచేసుకున్న బాలయ్య
Balakrishna - Bhagavanth Kesari: శ్రీలీలతో కలిసి స్టేజ్ మీదనే స్టెప్‍లు వేశారు బాలకృష్ణ. భగవంత్ కేసరి సినిమా కోసం నిర్వహించిన ప్రెస్ మీట్‍లో బాలయ్య పాల్గొన్నారు.
Balakrishna - Bhagavanth Kesari: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ దగ్గరపడుతోంది. మరో నాలుగు రోజుల్లో అంటే అక్టోబర్ 19వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. దసరా సందర్భంగా నవరాత్రుల సమయంలోనే భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మాస్ యాక్షన్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. కాగా, భగవంత్ కేసరి సినిమా కోసం నేడు (అక్టోబర్ 15) ప్రెస్ మీట్‍ను చిత్ర యూనిట్ నిర్వహించింది.

భగవంత్ సినిమా ప్రెస్ మీట్ కోసం ఏర్పాటు చేసిన స్టేజీపైనే హీరో బాలకృష్ణ.. శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉయ్యాలో ఉయ్యాల అనే సెంటిమెంటల్ సాంగ్‍కు స్టెప్స్ వేశారు. దీంతో అక్కడ ఉన్న వారు హర్షధ్వానాలు చేశారు. భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణ కూతురు పాత్ర చేశారు హీరోయిన్ శ్రీలీల. ఉయ్యాలో ఉయ్యాలకు భగవంత్ కేసరి, విజ్జి పాప డ్యాన్స్ చేశారంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది షైన్ స్క్రీన్స్. కూతురి సెంటిమెంట్ ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. భగవంత్ కేసరి మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటించారు.
కాగా, భగవంత్ కేసరి ప్రెస్ మీట్ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్‍తో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గతంలో తమకు క్యారీ వ్యాన్లు ఉండేవి కాదని, హాయిగా చెట్ల కింద కూర్చునే వారమని చెప్పారు. చాప, దిండు వేసుకొని పడుకునే వారమని అన్నారు. అప్పుడు విగ్ తీసేవాడనని చెప్పారు. ఓ వ్యక్తి “నువ్వు విగ్ పెట్టుకుంటావా” అని తనతో పరాచకంగా అన్నారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. “నేను విగ్ పెట్టుకుంటా. నీకేంటయ్యా. నువ్వేం పీక్కొని గడ్డం పెట్టుకున్నావని అడిగా” అని బాలకృష్ణ అన్నారు. తనదంతా ఓపెన్ బుక్ అని, ఎవడికి భయపడే పనేలేదని బాలకృష్ణ అన్నారు. దీంతో అక్కడున్న వారు విపరీతంగా నవ్వారు.
ఈ భగవంత్ కేసరి ప్రెస్ మీట్‍కు దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు థమన్ కూడా హాజరయ్యారు. ఈ సినిమాకు థమన్ అద్భుతంగా సంగీతం ఇచ్చారని బాలకృష్ణ చెప్పారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.