గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మంగళవారం (జూన్ 10) తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు అఖండ 2 మూవీ షూటింగ్ తోపాటు తన గురించి తాను చెప్పుకున్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.
మరికొద్ది నెలల్లో అఖండ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. అవును నాకు పొగరుంది అని అతడు అనడం గమనార్హం. తన పుట్టన రోజు వేడుకల్లో బాలయ్య మాట్లాడాడు. “వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చాం. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ హిట్ అయ్యాయి.
రేపు రాబోయే అఖండ తాండవం కూడా.. నేను ఒక సందర్భంలో చెప్పాను ఇక నుంచే బాలయ్య అంటే ఏంటో చూపిస్తానని అన్నాను. వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన తర్వాత ఇక చూపించడమేంటని అన్నారు. కానీ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలనే చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అవును.. నాకు పొగరుంది. నాకు దర్పం ఉంది. నన్ను చూసుకునే నాకు పొగరు. నా గురించి నాకు తెలుసు. మనల్ని మనం ప్రేమించుకోవాలి” అని బాలకృష్ణ అనడం విశేషం.
తాను ప్రతి పనినీ ఆస్వాదించి చేస్తానని ఈ సందర్బంగా చెప్పిన బాలయ్య.. అఖండ 2 షూటింగ్ గురించి చెప్పుకొచ్చాడు. జార్జియాలో -4 డిగ్రీల చలిలో తాను ఎలా షూటింగ్ చేసిందీ చెప్పాడు. “ఈ మధ్యే జార్జియాకు అఖండ షూటింగ్ కోసం వెళ్లొచ్చాం. అక్కడ మైనస్ 4 డిగ్రీల చలి.
నాకు ఓ పంచె, ఓ స్లీవ్ లెస్ ఇచ్చారు. గాలి కొడుతోంది. అక్కడున్న వాళ్లు జాకెట్లు వేసుకున్నా చలికి వణికిపోతున్నారు. కానీ నేను మాత్రం ఆ క్యారెక్టర్లో లీనమయ్యాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. మా నాన్నగారి ప్రతిరూపాన్ని మీరు నాలో చూసుకుంటున్నారు. ఆయన కారణ జన్ముడు. నా దైవం ఆయన” అని బాలయ్య అన్నాడు.
ఇక తనకు పద్మభూషణ్ వచ్చినా దానిని తనకు అలంకారంగా భావించనని, ఆ అవార్డును తనకు నటనకు పొరపాటున ఇచ్చారని, దానికంటే ఎక్కువ కూడా సాంఘిక సేవలకు ఇచ్చినట్లుగా తాను భావించినట్లు బాలకృష్ణ చెప్పాడు. అతని పుట్టిన రోజుకు ఒక రోజు ముందే అఖండ 2 మూవీ టీజర్ రిలీజ్ కాగా.. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం