Daaku Maharaj Prequel: డాకు మహారాజ్‍కు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్.. సక్సెస్ ఈవెంట్ అక్కడే: నాగవంశీ
Daaku Maharaj: డాకు మహారాజ్‍కు పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. ఇందులో కొన్ని విషయాలు వెల్లడించారు నిర్మాత నాగవంశీ. సక్సెస్ ఈవెంట్, ప్రీక్వెల్, మరో రెండు భాషల్లో రిలీజ్ సహా మరిన్ని అంశాలపై మాట్లాడారు.
డాకు మహారాజ్ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా పాజిటివ్ టాక్‍తో అదరగొడుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ కొల్లి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సూపర్ టాక్ వస్తోంది. బుకింగ్‍ల్లో జోరు పెరిగింది. ఈ తరుణంలో నేడు సక్సెస్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ఈ మీట్‍లో పాల్గొన్నారు. ఈ మీట్‍లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు నాగవంశీ.
సక్సెస్ ఈవెంట్ గురించి..
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్‍ను అనంతపురంలో ఈ వారంలోనే నిర్వహిస్తామని నాగవంశీ చెప్పారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన అక్కడే ఆ ఈవెంట్ జరుపుతామని వెల్లడించారు. అనంతపురంలో జనవరి 9న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ముందుగా డాకు మహారాజ్ మేకర్స్ అనుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా వస్తారని వెల్లడించారు. అయితే, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందటంతో ఈ ఈవెంట్‍ను మూవీ టీమ్ రద్దు చేసింది. దీంతో ఇప్పుడు డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్‍ను అనంతపురంలోనే నిర్వహించాలని డిసైడ్ అయింది.
ప్రీక్వెల్ ప్లాన్
డాకు మహారాజ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు కూడా నాగవంశీ స్పందించారు. ఈ సినిమా సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ ఉంటుందనే కామెంట్లు చేశారు. “దీనికి సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. గుర్రం మీద హెడ్‍లెస్ ఉంది కదా.. అది ఒక హీరోను చేసి ఓ ప్రీక్వెల్ చేద్దామని ప్రయత్నిస్తాం” అని నాగవంశీ చెప్పారు. గుర్రంపై కూర్చున్న ఓ మనిషికి తల లేకుండా ఉన్నట్టుగా డాకు మహారాజ్ చిత్రంలో ఓ షాట్ ఉంది. ఆ తల లేని మనిషి కథను ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా నాగవంశీ చెప్పారు.
మరో రెండు భాషల్లో రిలీజ్ డేట్
డాకు మహారాజ్ చిత్రాన్ని తమిళం, హిందీలోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ భాషలకు గాను సెన్సార్‌కు పంపించారు. దీనిపై కూడా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. జనవరి 17న రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. “బజ్ బాగా వస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు అడిగారు. అదే ప్లాన్ చేస్తున్నాం. సెన్సార్ పనులు పూర్తయిన తర్వాత తమిళం, హిందీలో జనవరి 17న రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం” అని నాగవంశీ చెప్పారు.
తెలంగాణలో బెనెఫిట్ షోలు లేకపోవడంపై వచ్చిన ప్రశ్నకు నాగవంశీ రియాక్ట్ అయ్యారు. బెనెఫిట్ షోలు లేకపోవడం వల్ల మంచే జరిగిందని అన్నారు. పాజిటివ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేందుకు సమయం దొరికిందనేలా మాట్లాడారు. ఆంధ్ర, ఓవర్సీస్ నుంచి వచ్చిన టాక్‍తో తెలంగాణలో బుకింగ్స్ భారీగా ఓపెన్ అయ్యాయని తెలిపారు.
డాకు మహారాజ్ చిత్రాన్ని యాక్షన్ మూవీగా తెరకెక్కించారు డైరెక్టర్ బాబీ. యాక్షన్‍కు స్టైల్‍ను మిక్స్ చేసి ఆకట్టుకున్నారు. బాలకృష్ణ మరోసారి యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టారు. ఈ మూవీలో బాబీ డియోల్, ప్రగ్వా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, షామ్ టామ్ చాకో కీరోల్స్ చేశారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం