Crow in Movies: కాకితో కాసుల వర్షం.. ఈ మూడు సినిమాల్లో పిట్ట కొంచెం కూత ఘనం-balagam virupaksha dasara where the crow plays crucial role in movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Balagam Virupaksha Dasara Where The Crow Plays Crucial Role In Movies

Crow in Movies: కాకితో కాసుల వర్షం.. ఈ మూడు సినిమాల్లో పిట్ట కొంచెం కూత ఘనం

Maragani Govardhan HT Telugu
May 13, 2023 09:43 PM IST

Crow in Movies: టాలీవుడ్‌లో ఇటీవల విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న బలగం, దసరా, విరూపాక్ష చిత్రాల్లో ఓ కామన్ విషయం ఉంది. ఈ మూడు సినిమాల్లో కాకి కీలక పాత్ర పోషిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే కథను మలుపు తిప్పిన కాకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

ఈ మూడు సినిమాలకు కాకితో కాసుల వర్షం
ఈ మూడు సినిమాలకు కాకితో కాసుల వర్షం

Crow in Movies: కథలు కావాలంటే ఎక్కడెక్కడో వెళ్తుంటారు మన దర్శకులు, రచయితలు. క్రియేటివ్ మైండ్ కోసం ఒక్కొక్కరూ విదేశాలకు వెళ్తే మరొకరు సముద్ర తీరాల్లో, పర్వతాల్లో ఇలా అనేక ప్రదేశాలకు వెళ్లి రాస్తుంటారు. తీరా ఆ కథ వెండితెరపైకి వచ్చేసరికి హిట్ అయితే ఫర్వాలేదు కానీ.. అదే ఫ్లాప్ అయితే మాత్రం ఆ కష్టమంతా వృథా అయినట్లే. అందుకే కథల కోసం ఎక్కడెక్కడికే వెళ్లే బదులు మన చుట్టూ ఉన్న పరిస్థితులను, సమాజాన్ని చూస్తే సరిపోదు.. అనేక జీవితాలే కథలుగా స్మరణకు వస్తాయి. అలాంటి బ్లాక్‌బాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో రూటెడ్ స్టోరీలుగా వచ్చిన బలగం, దసరా, విరూపాక్ష లాంటి చిత్రాలు ఈ కోవకే వస్తాయి. ఈ కథలను సింపుల్‌గా చెప్పడమే కాకుండా ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దారు దర్శకులు.

ట్రెండింగ్ వార్తలు

ఓ గ్రామంలో వరుసగా మరణాలను సంభవిస్తుండంతో హీరో ఎలా మిస్టరీని ఛేదించాడనేది విరూపాక్ష కథ. ఈ స్టోరీని డైరెక్టర్ కార్తిక్ దండు అద్భుతంగా చెప్పాడు. అలాగే కమెడియన్ అయిన వేణు బలగం సినిమాలో అంత్యక్రియల సమయంలో జరిగే డ్రామాను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఇక దసరా చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల.. ముగ్గురు స్నేహితులు విలేజ్ పాలిటిక్స్, తదితర కారణాల వల్ల తమ జీవితాల్లో ఎదుర్కొనే సవాళ్లను ఇందులో చూపించారు. అయితే ఈ మూడు సినిమాలకు ఓ కామన్ విషయం ఉంది. ఈ మూడింట్లోనూ కాకి కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా ప్రేక్షకులను మెప్పించి కాకి బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తుంది.

బలగం..

ముందుగా బలగం సినిమా విషయానికొస్తే కథ మొత్తం కాకి చుట్టూనే తిరుగుతుంది. తెలంగాణ గ్రామాల్లో వ్యక్తులు మరణించినప్పుడు కాకి ముట్టడం అనే సంప్రదాయాన్ని ఎంగేజింగ్‌గా చూపించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సమర్పించిన పిండాన్ని కాకి తింటే.. అది సదరు వ్యక్తే తిన్నాడని, అతడికి ఆత్మసంతృప్తి కలిగిందని నమ్ముతారు. తినకపోతే సదరు వ్యక్తి మనసులో ఏవో కోరికలు ఉన్నాయని భావిస్తారు. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని ముట్టనప్పుడు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు నెలకొన్నాయని, వాటిన్నింటిని అధిగమించినప్పుడు పిట్ట పిండాన్ని తింటుందని చూపించారు. బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

దసరా..

నాని-కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా చిత్రంలోనూ కథలో కీలక పాత్ర మరణించినప్పుడు కాకి పిండాన్ని ముట్టుకోదు. అనంతరం నాని.. కీర్తి సురేష్‌ను వివాహం చేసుకున్న తర్వాత కాకి పిండాన్ని తింటుంది. కథ ముందుకు సాగడానికి మరణాంతర కర్మల ప్రకారం కాకి పిండం ముట్టడాన్ని ఓ సంకేతంగా దర్శకుడు తీసుకున్నారు. అయితే బలగం చిత్రంలో మాదిరిగా సినిమా అంతా ఈ కాకి అంశం ఉండదు.. ఒకటి లేదా రెండు సన్నివేశాలకే పరిమితమవుతుంది. ఈ సినిమా నాని కెరీర్‌లో 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

విరూపాక్ష..

విరూపాక్ష చిత్రంలో కాకి పాత్ర.. బలగం, దసరా సినిమాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రంలో కాకి ప్రేక్షకులను భయపెడుతుంది. అతీంద్రియ శక్తులకు సంకేతంగా దీన్ని ఉపయోగించారు. ఇక్కడ కూడా కాకి మన నమ్మకాల్లో అంతర్భాగంగానే ఉంది. ప్రతినాయకులు చేసే చేతబడికి కాకి ప్రతిరూపంగా మారుతుంది. బ్లాక్ మ్యాజిక్‌ను ముందు కాకులపై చేసి వాటి ద్వారా మనుషులను లొంగతీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సినిమాలో కాకిని చూసినప్పుడల్లా అదో పక్షి అని మనకు అస్సలు అనిపించదు. కొన్ని సమయాల్లో సౌండ్‌కు భయం కలుగుతుంది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద రూ.91 కోట్ల వరకు వసూలు చేసింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.