Balagam: బలగం సినిమాకు సంవత్సరం.. ట్వీట్ చేసిన దర్శకుడు వేణు.. ఇప్పుడు ఈ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
1 year for Balagam Movie: తెలంగాణ గ్రామీణ బ్యాక్‍డ్రాప్‍లో వచ్చిన బలగం సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలై నేటితో సంవత్సరం పూర్తయింది.
Balagam Movie: బలగం సినిమా గతేడాది అంచనాలకు మించి విజయాన్ని.. భారీ ప్రశంసలను దక్కించుకుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిన ఈ ఎమోషనల్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జబర్దస్త్ కామెడీషోతో పాపులర్ అయిన వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎవరూ ఊహించని విధంగా బలగం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి.. తొలి మూవీతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వేణు. బలగం సినిమా కమర్షియల్‍గానూ భారీ సక్సెస్ అయింది. ఘన విజయంతో పాటు చాలా అవార్డులను గెలుచుకున్న బలగం మూవీ రిలీజై నేటి (మార్చి 3)కి ఏడాది పూర్తయింది.
బలగం సినిమా 2023 మార్చి 3వ తేదీన రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు సమర్పిస్తుండటంతో మంచి అంచనాలతోనే వచ్చింది. అయితే, రిలీజయ్యాక అందరి ఊహలకు మించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని, కుటుంబ సభ్యుల మధ్య ఉండే మనస్పర్థలు, బంధాలను, భావోద్వేగాలను దర్శకుడు వేణు చూపించిన విధానం అందరి ప్రశంసలను పొందింది. రూ.3కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ఏకంగా సుమారు రూ.27 కోట్ల వసూళ్లను సాధించింది.
వేణు ట్వీట్
బలగం సినిమాకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా దర్శకుడు వేణు ఎల్దండి నేడు ట్వీట్ చేశారు. మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. “బలగం చిత్రానికి సంవత్సరం. మద్దతు తెలిపిన, ఆశీర్వదించిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు. జబర్దస్త్ కమెడియన్ అని గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి.. బలగం సినిమాతో దర్శకుడిగా పాపులర్ అయ్యారు.
బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధానబలంగా నిలిచింది. కుటుంబ పెద్ద గాజుల కొమరయ్యగా నటించిన సుధాకర్ రెడ్డి కూడా తన నటనతో మెప్పించారు. కోట జయరాం, కొమ్ము సుజాత, మురళీధర్ గౌడ్, రూపలక్ష్మి, మైమ్ మధు, వేణు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
భీమ్స్ సెసిరోలియో అందించిన సంగీతం బలగం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఈ చిత్రంలో పాటలు చాలా ఫేమస్ కాగా.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. హర్షిత రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. దిల్‍రాజు సమర్పించారు.
అంతర్జాతీయ అవార్డులు
బలగం సినిమాకు అంతర్జాతీయంగానూ చాలా గుర్తింపు లభించింది. కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. చాలా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లాజ్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్, గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాంబుల్, డెన్వెర్ మోంటీ ఫిల్మ్ క్రిటిట్స్ సహా మరిన్ని అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమాకు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి.
బలగం ఏ ఓటీటీలో..
బలగం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడాలంటే ఆ ప్లాట్‍ఫామ్‍లో వీక్షించవచ్చు.
దర్శకుడిని కావాలనే లక్ష్యంతోనే తాను సినీ ఇండస్ట్రీకి వచ్చానని వేణు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బలగం చిత్రంతో తన కల నెరవేరిందని అన్నారు. నేచురల్ స్టార్ నానితో వేణు ఎల్దండి తదుపరి సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవల నాని పుట్టిన రోజున ఆయనను కలిసి విష్ కూడా చేశారు వేణు.