ప్రభాస్ అంటే బాహుబలి.. బాహుబలి అంటే ప్రభాస్ అనేంతలా ఆ సినిమాకు రెబల్ స్టార్ అంతలా సెట్ అయ్యాడు. కానీ ఆ మూవీకి అసలు మొదటగా అతన్ని అనుకోలేదన్న వార్తలు వైరల్ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి: ది ఎపిక్' (ఇది 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' కలిపి) గురించి అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా రన్ టైమ్ తోపాటు మరో చర్చ కూడా జరిగింది.
అది హృతిక్ రోషన్ ను ఒకప్పుడు ఆ ప్రభాస్ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాత శోభు యార్లగడ్డ ‘గుల్టే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటన్నింటిపై స్పష్టత ఇచ్చాడు.
'బాహుబలి: ది ఎపిక్' ప్రకటన తర్వాత ప్రభాస్ పాత్ర కోసం మొదట హృతిక్ రోషన్‌ను సంప్రదించారని ఆన్‌లైన్‌లో విపరీతమైన చర్చ జరిగింది. అయితే శోభు దీని గురించి ఎవరూ అడగకుండానే స్పందించి ఆ పుకార్లను కొట్టిపారేశాడు.
అతడు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బాహుబలి పాత్ర కోసం మేము హృతిక్‌ను అడిగామని ఆన్‌లైన్ చర్చ చూస్తున్నాను. అది ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచీ అది ప్రభాస్ మాత్రమే" అని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్.. అమరేంద్ర బాహుబలి, అతని కుమారుడు మహేంద్ర బాహుబలి (శివుడు పాత్ర కూడా) అనే డ్యుయల్ రోల్స్ చేశాడు.
ఇక బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ కూడా రివీల్ అయింది. ఈ సినిమా 5 గంటల కంటే ఎక్కువ నిడివి ఉంటుందనే పుకార్లను కూడా శోభు తోసిపుచ్చాడు. బదులుగా ఇది సుమారు 3 గంటల 40 నిమిషాల నిడివి ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా సినిమా చివర్లో 'బాహుబలి 3' గురించి ప్రకటన ఉంటుందనే వదంతులను కూడా అతడు ఖండించాడు.
నిర్మాత మాట్లాడుతూ.. "ప్రభాస్ అన్ని హై సీన్స్ అలాగే ఉంచాము. ప్రభాస్, రానా కీలక సన్నివేశాలు కూడా అలాగే ఉన్నాయి. పాటలు, కొన్ని సన్నివేశాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని నేను భావిస్తున్నాను. కొన్ని పాటలు అయితే కచ్చితంగా ఉన్నాయి. చాలా సన్నివేశాలు ట్రిమ్ చేశాము" అని చెప్పాడు.
'బాహుబలి: ది ఎపిక్' అనేది రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రాలకు రీమాస్టర్డ్ రీ-ఎడిటెడ్ వెర్షన్. ఇది ఈ అక్టోబర్ 31 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ బాహుబలిలో ప్రభాస్ తోపాటు రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, నాజర్, సత్యరాజ్ కూడా నటించారు.
సంబంధిత కథనం