Tollywood: టాలీవుడ్ బ్యాడ్‌టైమ్ - రెండు నెలల్లో 30 సినిమాలు రిలీజ్ - రెండే హిట్లు - డిజాస్టర్లు ఇచ్చిన స్టార్లు
Tollywood: జూలై, ఆగస్ట్ లో దాదాపు 30 వరకు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ ముప్పై సినిమాల్లో రెండు మాత్రమే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. రవితేజ, రామ్ వంటి స్టార్లు సైతం ఆడియెన్స్‌ను డిసపాయింట్ చేశారు.
Tollywood: టాలీవుడ్‌కు జూలై, ఆగస్ట్ అంతగా అచ్చి రాలేదు. ఈ రెండు నెలల్లో ఇప్పటివరకు 30 సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఆయ్, కమిటీ కుర్రాళ్లు...ఈ రెండు మాత్రమే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. మిగిలిన సినిమాలు డిజాస్టర్లుగా నిలిచి ఫ్యాన్స్‌తో పాటు ప్రొడ్యూసర్లను డిసపాయింట్ చేశాయి.
జూలైలో జీరో హిట్స్...
జూలై నెలలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. దాదాపు పదికి వరకు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు జూలైలో తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
అందులో ఏ ఒక్కటి కూడా హిట్టు టాక్ తెచ్చుకోలేకపోయాయి. ప్రియదర్శి డార్లింగ్, రాజ్ తరుణ్ పురుషోత్తముడు. పేకమేడలు, ది బర్త్‌డే బాయ్, ఆపరేషన్ రావణ్‌తో పాటు మరికొన్ని సినిమాలు జూలైలో థియేటర్లలోకి వచ్చాయి. ఇందులో చాలా సినిమాలు ఫస్ట్ వీకెండ్ ముగిసేలోగా థియేటర్లలో కనిపించకుండా పోయాయి. మరికొన్ని సినిమాలు రిలీజయ్యాయని ఆడియెన్స్‌కు తెలిసే లోపే థియేటర్ల నుంచి కనుమరుగయ్యాయి. జూలై నెల మొత్తం నష్టాలతోనే సాగింది.
స్టార్లకు డిజాస్టర్లు...
ఆగస్ట్ నెలలో రవితేజ, రామ్‌పోతినేని వంటి స్టార్లు నిలవడంతో బ్లాక్‌బస్టర్ హిట్టు పక్కగా దక్కుతుందని ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. ఈ అంచనాలకు తగ్గట్లే ఆగస్ట్ నెలలో వారానికి నాలుగైదు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో అశ్విన్ బాబు శివంభజే, అల్లు శిరీష్ బడ్డీ, రాజ్ తరుణ్ తిరగబడరా సామీ పాటు కొన్ని చిన్న సినిమాలు రిలీజైన థియేటర్లలో మాత్రం సందడి చేయలేకపోయాయి. రొటీన్ కాన్సెప్ట్‌ల కారణంగా ఈ సినిమాలను ఆడియెన్స్ నిర్మొహమాటంగా తిప్పికొట్టారు.
కమిటీ కుర్రాళ్లు సేఫ్....
ఆగస్ట్ 9న జగపతిబాబు సింబా, నిహారిక కొణిదెల కమిటీ కుర్రాళ్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఇందులో సింబా పరాజయం పాలవ్వగా కమిటీ కుర్రాళ్లు మాత్రం నిహారికకు లాభాలను తెచ్చిపెట్టింది. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది.
రవితేజ వర్సెస్ రామ్...
ఇండిపెండెన్స్ డే బరిలో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ నిలిచాయి. మాస్‌లో ఇద్దరు హీరోలకు ఉన్న క్రేజ్ కారణంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పై భారీగా హైప్ ఏర్పడింది. కానీ ఔట్‌డెటెడ్ కాన్సెప్ట్‌ల కారణంగా ఈ రెండు సినిమాలు నిర్మాతలను గట్టిగా దెబ్బకొట్టాయి.
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌కు పోటీగా రిలీజైన చిన్న సినిమా ఆయ్ మాత్రం సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది. ఆయ్ మూవీలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించాడు. కామెడీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ వారం రిలీజైన రావురమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం తొలిరోజు కోటిన్నర వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిట్టా ఫట్టా అన్నది మరో ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.
సరిపోదా శనివారంపైనే ఆశలు...
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తర్వాత బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ నిరీక్షణకు సరిపోదా శనివారంతో పుల్‌స్టాప్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాని హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 29న రిలీజ్ కాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తోన్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.