Bad Newz Box office: విక్కీ, త్రిప్తి డిమ్రి రొమాంటిక్ కామెడీ మూవీకి తొలి రోజు ఎంత కలెక్షన్లు వచ్చాయంటే?
Bad Newz Day 1 Box office Collections: బ్యాడ్‍న్యూజ్ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే వచ్చాయి. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఈ మూవీ మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. ఈ చిత్రానికి ఫస్ట్ డే వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
బాలీవుడ్‍లో ఇటీవల బ్యాడ్‍న్యూజ్ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ తృప్తి డిమ్రి మధ్య వచ్చిన రొమాంటిక్ సాంగ్ పాపులర్ అయింది. ఈ బ్యాడ్‍న్యూజ్ చిత్రం ఈ శుక్రవారం (జూలై 19) థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మంచి ఓపెనింగ్‍ను అందుకుంది.
తొలి రోజు కలెక్షన్లు ఇవే..
బ్యాడ్ న్యూజ్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.8.50 కోట్ల నెట్ కలెక్షన్లు (రూ.10కోట్ల గ్రాస్) వచ్చాయి. ఈ సినిమాకు ఇది మంచి ఓపెనింగ్‍గానే ఉంది. మంచి ఆక్యుపెన్సీనే దక్కించుకుంది.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్‍న్యూజ్ మూవీకి తొలి రోజు రూ.12.50కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్‍లో కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం కలిసి వచ్చే అంశంగా ఉంది.
బ్యాడ్‍న్యూజ్ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. విక్కీ కౌశల్, తృప్తి డిమ్రితో పాటు అమ్మీ విర్క్ కూడా మెయిన్ రోల్ చేశారు. నేహా దూపియా, షీబా చద్దా, ఫైజల్ రషీద్, ఖయాలీ రామ్, గునీత్ సింగ్ సోధి, కమలేశ్ కుమారి కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్లు అనన్య పాండే, నేహా శర్మ క్యామియోల్లో కనిపించారు.
మిక్స్డ్ టాక్
అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో 2019లో వచ్చిన గుడ్‍న్యూజ్‍కు సీక్వెల్‍గా ఇప్పుడు బ్యాడ్‍న్యూజ్ చిత్రం వచ్చింది. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విక్కీ, తృప్తి రొమాంటిక్ జానమ్ సాంగ్‍తో పాటు ట్రైలర్ కూడా ఆకట్టుకోవటంతో బజ్ వచ్చింది. అయితే, బ్యాడ్‍న్యూస్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కామెడీ అనుకున్నంతగా లేదని, కథ కూడా అసంపూర్ణంగా ముగించిన ఫీలింగ్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విక్కీ, తృప్తి డిమ్రి యాక్టింగ్‍కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రన్ ఎలా ఉంటుందో చూడాలి.
బ్యాడ్‍న్యూజ్ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ పతాకాలపై కరణ్ జోహార్, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా, అమృత్ పాల్ బింద్రా, ఆనంద్ తివారీ నిర్మించారు. ఈ మూవీకి రోచక్ కోహ్లీ, విశాల్ మిశ్రా సహా మరో నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.
బ్యాడ్‍న్యూజ్ ఓటీటీ డీల్ ఫిక్స్
బ్యాడ్‍న్యూస్ చిత్రానికి రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్ ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ దక్కించుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.