Baby John Collections: టార్గెట్ 75 కోట్లు - వచ్చింది 19 కోట్లు - డిజాస్టర్ దిశగా కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ
Baby John Collections: కీర్తి సురేష్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ డిజాస్టర్ దిశగా సాగుతోంది. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మూడు రోజుల్లో 19 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. దళపతి విజయ్ తేరీ రీమేక్‌గా తెరకెక్కిన బేబీ జాన్ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.
Baby John Collections: బేబీ జాన్ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ తేరీ రీమేక్‌గా రూపొందిన బేబీ జాన్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.
వామికా గబ్బీ మరో హీరోయిన్‌గా కనిపించిన ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించాడు. తేరీ డైరెక్టర్ అట్లీ ఈ బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. బేబీ జాన్ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటించాడు.
180 కోట్ల బడ్జెట్...
2024లో ఏడాదిలో రిలీజ్ అవుతోన్న చివరి బాలీవుడ్ మూవీగా బేబీ జాన్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మూడు రోజుల్లో కేవలం 19 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఫస్ట్ డేతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్స్ 70 శాతం వరకు డ్రాప్ అయ్యాయి.
తొలిరోజు కలెక్షన్స్...
తొలిరోజు బేబీ జాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా పదకొండు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, ఒరిజినల్‌ను మక్కీకి మక్కీగా కాపీ కొట్టడంతో ఈ రీమేక్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి వసూళ్లు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. సెకండ్ డే 4.75 కోట్లు...మూడో రోజు మూడున్నర కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది.
మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమాకు 19.65 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాడు. దాదాపు 75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. కలెక్షన్స్ డ్రాప్ చూస్తుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది.
పుష్ప 2 కంటే తక్కువే...
శుక్రవారం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ హిందీ వెర్షన్‌లో సగం కూడా బేబీ జాన్ వసూళ్లను రాబట్టలేకపోయింది. పుష్ప 2 మూవీ 23వ రోజున కూడా హిందీలో అదరగొట్టింది. శుక్రవారం రోజు 6.90 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. పుష్ప 2కు బేబీ జాన్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
బేబీ జాన్ కథ ఏంటేంటే?
ఐపీఎస్ ఆఫీసర్ సత్య (వరుణ్ ధావన్) ముంబైలోని రౌడీలను గడగడవణికిస్తాడు. నానాజీ (జాకీ ష్రాఫ్) చేస్తోన్న ఇల్లీగల్ బిజినెస్‌లకు సత్య చెక్ పెడతాడు. సత్యను టార్గెట్ చేసిన నానాజీ అతడి కుటుంబానికి ఎలాంటి ఆపద తలపెట్టాడు?సత్య భార్య మీరా(కీర్తిసురేష్)కు ఏమైంది? ముంబైని వదిలిపెట్టిన సత్య తన కూతురితో కేరళలో ఎందుకు సెటిల్ అయ్యాడు? అన్నదే ఈ మూవీ కథ.