Baby Director Sai Rajesh: పాపం సాయి రాజేష్.. సిగ్గు లేకుండా ఆ గారెలన్నీ తినేశాడట.. ఇంతకీ ఏం జరిగిందంటే?
Baby Director Sai Rajesh: బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తెలుసు కదా. అతనికి ఈ మధ్య ఓ వింత అనుభవం ఎదరైందట. అతన్ని ఓ బేబీ డైరెక్టర్ అనుకొని పొరపడి ఇంటికి భోజనానికి పిలిస్తే సిగ్గు లేకుండా గారెలన్నీ తినేశానని చెప్పడం విశేషం.
Baby Director Sai Rajesh: ఒక్కోసారి సినిమా టైటిల్స్ వల్ల.. మరోసారి నటులు, డైరెక్టర్ల పేర్ల వల్ల అభిమానులు తికమకపడుతుంటారు. వాళ్లు వీళ్లే అనుకుంటారు. కానీ వాళ్లు వీళ్లు కాదని తెలిసిన తర్వాత ఆ అభిమానులకి, వీళ్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి అనుభవమే బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ కు కూడా ఎదురైందట. ఇంతకీ ఏం జరిగిందంటే?

బేబీ డైరెక్టర్‌ను ఓ బేబీ డైరెక్టర్ అనుకొని..
టాలీవుడ్ లో ఇప్పటికే బేబీ, ఓ బేబీ అంటూ రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలుసు కదా. రెండూ హిట్ సినిమాలే. బేబీకి డైరెక్టర్ సాయి రాజేష్ అయితే.. ఓ బేబీని నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. కానీ ఈ బేబీ, ఓ బేబీ ఒకటే అనుకున్నారేమో.. ఆ ఓ బేబీని ఇష్టపడే ఓ అభిమాని కుటుంబం ఈ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ను ఇంటికి భోజనానికి పిలిచారట. తర్వాత వాళ్లు మాట్లాడుతుంది ఓ బేబీ గురించి అన తాను కూడా కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాడట.
ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అతడే వెల్లడించాడు. సాయి రాజేష్ ఏమన్నాడంటే.. "నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణస్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, “నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది అడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు” అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది, హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను.
10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్ కి, కొరియర్ బాయ్ కి, సార్ తో సెల్ఫీ దిగండి, “బేబీ సినిమా డైరెక్టర్“ అని 30 ఫోటోలు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్ లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. “మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫోటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో ” అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి. O Babyyyyyyy" అని రాసుకొచ్చాడు.
నిజానికి వాళ్లు అభిమానిస్తున్న సినిమా బేబీ కాదు ఓ బేబీ. ఆ మూవీలోనే సమంత నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ బేబీ డైరెక్టర్ పై వాళ్లు ప్రేమ కురిపిస్తూ.. ఎన్నో వండి వడ్డించినా.. తాను చివరికి విషయం తెలిసి సిగ్గు లేకుండా తినేశానని సాయి రాజేష్ అనడం విశేషం.
బేబీ మూవీ గురించి..
సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ మూవీ గతేడాది జులైలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆనంద దేవరకొండతోపాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ఈ రొమాంటిక్ డ్రామాను కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. అది కాస్తా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేయడం విశేషం.
బేబీ మూవీ తర్వాత సాయి రాజేష్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. దీంతో నిజంగానే వాళ్లు తన సినిమాను అభిమానించే తనకు ఆతిథ్యమిచ్చారని అతడు భావించి ఉంటాడు. కానీ చివరికి ఇలా జరిగే సరికి ఎంతో ఇబ్బంది పడ్డాడో పాపం.