Sathyaraj Web Series: ముగ్గురు భార్య‌ల‌తో క‌ట్ట‌ప్ప క‌ష్టాలు - తెలుగులోనూ స‌త్య‌రాజ్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌-baahubali fame sathyaraj comedy web series perfect husband to stream on disney plus hotstar soon comedy web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sathyaraj Web Series: ముగ్గురు భార్య‌ల‌తో క‌ట్ట‌ప్ప క‌ష్టాలు - తెలుగులోనూ స‌త్య‌రాజ్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌

Sathyaraj Web Series: ముగ్గురు భార్య‌ల‌తో క‌ట్ట‌ప్ప క‌ష్టాలు - తెలుగులోనూ స‌త్య‌రాజ్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Aug 03, 2024 12:13 PM IST

Sathyaraj Web Series: స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో ప‌ర్‌ఫెక్ట్ హ‌జ్బెండ్ పేరుతో ఓ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

స‌త్య‌రాజ్  వెబ్ సిరీస్
స‌త్య‌రాజ్ వెబ్ సిరీస్

Sathyaraj Web Series: బాహుబ‌లి ఫేమ్ స‌త్య‌రాజ్ ఓ కామెడీ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నాడు. ప‌ర్‌ఫెక్ట్ హ‌జ్బెండ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ త‌ర‌హా లుక్‌లో క‌ట్ట‌ప్ప క‌నిపిస్తోన్నాడు. ఈ పోస్ట‌ర్‌లో సీనియ‌ర్ హీరోయిన్ సీత‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యాక్ట‌ర్లు క‌నిపిస్తోన్నాయి.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో...

ఫ్యామిలీ డ్రామాకు కామెడీని జోడించి తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. త్వ‌ర‌లోనే ఈ సిరీస్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు హాట్ స్టార్ ప్ర‌క‌టించింది. త‌మిళంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని హాట్ స్టార్ ప్ర‌క‌టించింది.

తెలుగు హీరోయిన్లు...

ఈ సిరీస్‌లో స‌త్య‌రాజ్‌, సీత‌తో పాటు తెలుగు హీరోయిన్లు వ‌ర్ష బొల్ల‌మ్మ‌, ర‌మ్య ప‌సుపులేటి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఇందులో భార్య ముందు ప‌ర్‌ఫెక్ట్ హ‌జ్బెండ్‌గా న‌టిస్తూ మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో రిలేష‌న్ కొన‌సాగించే వ్య‌క్తిగా స‌త్య‌రాజ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త‌న ఎఫైర్స్ దాచే క్ర‌మంలో అత‌డు ఎదుర్కొనే ఇబ్బందులు వినోదాన్ని పంచుతాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

బాల‌చంద‌ర్ శిష్యురాలు...

ప‌ది ఎపిసోడ్స్‌తో రూపొందిన ప‌ర్‌ఫెక్ట్ హ‌జ్బెండ్ వెబ్‌సిరీస్‌కు ఎన్ వీ నిర్మ‌ల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తొలుత ఈ సిరీస్‌కు ద‌ర్శ‌కురాలిగా బాల‌చంద‌ర్ శిష్యురాలు తామీరా ఖ‌రారైంది. కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో తామీరా క‌న్నుమూసింది. దాంతో ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ చాలా రోజుల పాటు నిలిచింది. తామీరా ప్లేస్‌లో నిర్మ‌ల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టి సిరీస్ షూటింగ్‌ను పూర్తిచేశారు.

క‌ట్ట‌ప్ప పాత్ర‌తో...

ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహ‌బ‌లిలో క‌ట్ట‌ప్ప‌గా క‌నిపించాడు స‌త్య‌రాజ్‌. ఈ పాత్ర స‌త్య‌రాజ్‌కు ఎన‌లేని పేరుప్ర‌ఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. బాహుబ‌లితో పాన్ ఇండియ‌న్ ఆడియెన్స్‌కు చేరువ‌య్యాడు.

హిందీలో బిజీ...

బాహుబలి త‌ర్వాత తెలుగుతో పాటు హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో స‌త్య‌రాజ్‌కు అవ‌కాశాలు వ‌స్తోన్నాయి. ఈ ఏడాది రిలీజైన బాలీవుడ్ హార‌ర్ మూవీ ముంజ్యాలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి పెద్ద హిట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న సికంద‌ర్ మూవీలో స‌త్య‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీకి ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మిళంలో ఇటీవ‌లే వెప‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు స‌త్య‌రాజ్‌. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ కూలీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్నాడు. తెలుగులో గ‌త ఏడాది రిలీజైన చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌లో చివ‌ర‌గా క‌నిపించాడు స‌త్య‌రాజ్‌.