David Warner in Telugu Movie: డేవిడ్ వార్నర్ క్యామియో పుష్ప 2లో కాదు! ఏ తెలుగు సినిమాలో అంటే..-australian cricketer david warner does cameo in nithiin robinhood movie not in allu arjun pushpa 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  David Warner In Telugu Movie: డేవిడ్ వార్నర్ క్యామియో పుష్ప 2లో కాదు! ఏ తెలుగు సినిమాలో అంటే..

David Warner in Telugu Movie: డేవిడ్ వార్నర్ క్యామియో పుష్ప 2లో కాదు! ఏ తెలుగు సినిమాలో అంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 22, 2024 04:06 PM IST

David Warner in Telugu Movie: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ తెలుగు చిత్రంలో క్యామియో రోల్ చేస్తున్నారంటూ ఇటీవల కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. పుష్ప 2 చిత్రంలోనే ఆయన కనిపించనున్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే, పుష్ప 2లో కాకుండా వేరే చిత్రంలో వార్నర్ క్యామియో చేశారట. ఆ వివరాలు ఇవే..

David Warner in Telugu Movie: డేవిడ్ వార్నర్ క్యామియో పుష్ప 2లో కాదు! ఏ తెలుగు  సినిమాలో అంటే..
David Warner in Telugu Movie: డేవిడ్ వార్నర్ క్యామియో పుష్ప 2లో కాదు! ఏ తెలుగు  సినిమాలో అంటే..

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీకి ఆయన పెద్ద ఫ్యాన్. చాలాసార్లు మైదానంలోనే పుష్ప పాటలకు స్టెప్స్ వేశారు. ఇన్‍స్టాగ్రామ్‍లో పుష్ప మూవీకి సంబంధించి చాలా వీడియోలు చేశారు. ఒకప్పుడు ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటంతో తెలుగు సినిమాలు వార్నర్‌కు దగ్గరయ్యాయి. పుష్ప మూవీ గురించి వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అల్లు అర్జున్ స్పందించడం కూడా జరిగింది.

‘పుష్ప 2: ది రూల్’లో డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేస్తున్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఓ మూవీ షూటింగ్ స్పాట్‍లో వార్నర్ గన్ పట్టుకొని నిల్చున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. దీంతో ఆయన నటిస్తున్నది పుష్ప 2లోనే అని పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే, వార్నర్ కనిపించిందనున్నది పుష్ప 2లో కాదని, ఏ చిత్రంలో కనిపించనున్నారో తాజాగా స్పష్టత వచ్చింది.

నితిన్ మూవీలో వార్నర్

యంగ్ హీరో నితిన్ హీరోగా ఉన్న రాబిన్‍హుడ్ చిత్రంలో డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు. ఆ మూవీలో స్పెషల్ పాత్రలో కాసేపు కనిపించనున్నారు. ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ సీన్ షూటింగ్ మూడో రోజుల కిందట ఆస్ట్రేలియాలో జరిగింది. ఆ లొకేషన్ నుంచే ఫోటోలు లీక్ అయ్యాయి.

డేవిడ్ వార్నర్.. వైట్ డ్రెస్ ధరించి గన్ పట్టుకొని షూటింగ్‍లో పాల్గొన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. రాబిన్‍హుడ్ చిత్రం షూటింగ్‍లోనేదే ఇది అని ఇప్పుడు సమాచారం బయటికి వచ్చింది. వార్నర్ క్యామియోను సర్‌ప్రైజ్‍గా ఉంచాలని మూవీ టీమ్ అనుకుంటే.. ఇప్పటికే ఈ విషయం లీక్ అయింది. మొత్తంగా తొలిసారి తెలుగు చిత్రంతోనే తెరంగేట్రం చేస్తున్నారు స్టార్ క్రికెటర్ వార్నర్.

రాబిన్‍హుడ్ గురించి..

నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ మూవీకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యేందుకు దగ్గరపడింది. గతంలో నితిన్ - వేణు కాంబోలో భీష్మ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాబిన్‍హుడ్ చేస్తుండటంతో మంచి హైప్ ఉంది.

రాబిన్‍హుడ్ మూవీలో దొంగ పాత్ర పోషిస్తున్నారు నితిన్. డబ్బు గురించి ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని డైరెక్టర్ వేణు తెరకెక్కిస్తున్నారు.

రాబిన్‍హుడ్ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రానికి రష్మిక మందన్నా హీరోయిన్‍గా ఉండగా.. ఆమె తప్పుకున్నారు. దీంతో ఆ ప్లేస్‍లో లీల వచ్చేశారు. వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

రాబిన్‍హుడ్ చిత్రాన్ని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. దానికి తగ్గట్టే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంది. అదే ఆ సమయానికి రామ్‍చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాబిన్‍హుడ్ వాయిదా పడక తప్పేలా లేదు. సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనను కూడా రాబిన్‍హుడ్ మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ డేట్‍పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.