అతడు సీక్వెల్.. వాళ్లిద్దరూ డేట్లు ఇస్తే మా బ్యానర్ పైనే.. శోభన్ బాబుకు బ్లాంక్ చెక్: మురళీ మోహన్ కామెంట్లు-athadu movie sequel mahesh babu trivikram dates producer murali mohan comments athadu re release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అతడు సీక్వెల్.. వాళ్లిద్దరూ డేట్లు ఇస్తే మా బ్యానర్ పైనే.. శోభన్ బాబుకు బ్లాంక్ చెక్: మురళీ మోహన్ కామెంట్లు

అతడు సీక్వెల్.. వాళ్లిద్దరూ డేట్లు ఇస్తే మా బ్యానర్ పైనే.. శోభన్ బాబుకు బ్లాంక్ చెక్: మురళీ మోహన్ కామెంట్లు

తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్ గా నిలిచిన మూవీ ‘అతడు’. టీవీల్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటివరకూ కొన్ని వందల సార్లు టీవీలో వచ్చినా ఆ మూవీకి క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పుడీ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అతడు సీక్వెల్ పై మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మురళీ మోహన్ (x/Athadu4K)

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో శనివారం (జులై 26) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అతడు సీక్వెల్ పైనా మాట్లాడారు.

సీక్వెల్ ప్లాన్

మహేష్ బాబు, త్రివిక్రమ్ రెడీ అంటే సీక్వెల్ ప్లాన్ చేస్తామని మురళీ మోహన్ అన్నారు. ‘‘మహేష్ బాబు, త్రివిక్రమ్ డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ఈ మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బుల్లితెరపై వచ్చాక సినిమా గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ రిలీజ్‌కు ఇంత క్రేజ్ ఏర్పడింది. ఒకప్పుడు థియేటర్లో మాత్రమే సినిమాలు చూస్తుండేవారు. ఆ తరువాత టీవీలు వచ్చాయి. కానీ ఇప్పుడు రకరకాల మాధ్యమాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు థియేటర్లో సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు. టెక్నికల్‌గా ‘అతడు’ని అప్ గ్రేడ్ చేసి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అని మురళీ మోహన్ అన్నారు.

ఆ పాత్రకు శోభన్ బాబు

అతడు సినిమాలో నాజర్ పోషించిన తాతయ్య పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం మొదట శోభన్ బాబు ను సంప్రదించామని మురళీ మోహన్ వెల్లడించారు. ‘‘నాజర్ పోషించిన పాత్రకి శోభన్ బాబును అనుకున్నాం. ఆ పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్‌ను పంపించాం. కానీ మా ఆఫర్‌ను తిరస్కరించారు. హీరోగానే అందరికీ గుర్తుండాలి కానీ ఇలా ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. త్రివిక్రమ్ ‘అతడు’ మూవీని చాలా డిఫరెంట్‌గా తీశారు. ఆ టైంలో ఈ మూవీ ఓవర్సీస్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బుల్లితెరపై ఎక్కువ సార్లు ప్రదర్శించిన చిత్రంగా ‘అతడు’ రికార్డులు క్రియేట్ చేసింది’’ అని మురళీ మోహన్ చెప్పారు.

అప్ గ్రేడ్ చేసి

అతడు మూవీని అప్ గ్రేడ్ చేసి 4కేలో రిలీజ్ చేస్తున్నామని మురళీ మోహన్ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి ఈ మూవీని మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ప్రసాద్ అండ్ టీం సహకరించింది. రైటర్‌గా త్రివిక్రమ్ మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు మా బ్యానర్‌లో దర్శకుడిగా పరిచయం చేసి, ఆయనతో మొదటి సినిమా చేయాలని అనుకున్నాం. కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం స్రవంతి కిషోర్ కు సినిమా చేసి వచ్చారు. అతడు కథను కళ్లకు కట్టినట్లు చెప్పారు’’ అని మురళీ మోహన్ పేర్కొన్నారు.

ఆలస్యమైనా

‘‘అతడు సినిమా కోసం ఓ ఇంటి సెట్‌ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. దాదాపు 90 శాతం సీన్లు అదే సెట్‌లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్‌ను చాలా మంది వాడుకున్నారు. అయితే ఆ తరువాతి కాలంలో ఓఆర్ఆర్ రావడంతో ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్లం. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా సరే మహేష్ బాబు ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది. రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కచ్చితంగా నమ్ముతున్నా’’ అని మురళీ మోహన్ అన్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం