Kishkindha Kaandam Review: ఊపిరి బిగబెట్టి చూసేలా ట్విస్ట్‌లు, చిన్న పేపర్ ముక్కలతో వీడే మిస్టరీ.. కిష్కింద కాండం రివ్యూ
Kishkindha Kaandam OTT: లైసెన్స్ గన్ మిస్సింగ్‌తో మొదలయ్యే మిస్టరీ.. ఊహించని మలుపుతూ తిరుగుతూ చివరికి మర్డర్ మిస్టరీని ఛేదిస్తుంది. సినిమా
Kishkindha Kaandam Movie Review: అబద్ధాల బాటలో నిజాల వేట కోసం సాగే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాలు ప్రేక్షకుల్ని కొత్తలోకంలోకి తీసుకెళ్తుంటాయి. అలాంటి సినిమానే ఈ కిష్కింద కాండం. మలయాళంలో ఇటీవల విడుదలైన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ రూ.75 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. ఇంతకీ ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? రూ.7 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ ‘కిష్కింద కాండం’ మూవీ జోరు కొనసాగుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో కిష్కింద కాండం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏంటంటే?
ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) భార్య చనిపోయి ఉంటుంది. అలానే నాలుగేళ్ల కొడుకు చాచు (మాస్టర్ ఆరవ్) కూడా కనబడకుండా పోయి ఉంటాడు. అతనితో పాటు ఇంట్లో తండ్రి అప్పు పిళ్లై (విజయ్ రాఘవన్) మాత్రమే ఉంటాడు. అతనికి మతిమరుపు. ఈ నేపథ్యంలో రెండో భార్యగా అపర్ణ (అపర్ణా బాలమురళి)ని అజయ్ చంద్రన్ పెళ్లి చేసుకుంటాడు. అయితే.. కాపురానికి వచ్చిన అపర్ణకి మొదటి నుంచి మామ గారి ప్రవర్తనపై అనుమానం మొదలవుతుంది. అప్పటికే అప్పు పిళ్లై లైసెన్స్ గన్ మిస్ అవ్వడంతో.. ఎన్నికల వేళ పోలీసులు అతడ్ని అనుమానిస్తుంటారు. ఈ క్రమంలో సడన్‌గా ఓ కోతి చేతిలో ఆ గన్ ఉన్న ఫొటో వెలుగులోకి వస్తుంది.
కట్టిపడేసే స్క్రీన్‌ప్లే
అసలు కోతి చేతికి ఆ గన్ ఎలా వెళ్లింది? గన్‌లో నుంచి రెండు బుల్లెట్లు ఎలా మిస్ అయ్యాయి? అజయ్ చంద్రన్ ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది? అతని నాలుగేళ్ల కొడుకు చాచూ ఎలా కనిపించకుండా పోయి ఉంటాడు? ఈ ప్రశ్నలకి సమాధానం వెతికే క్రమంలో ఊహించని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. కథలో ఎక్కడా బిగువు సడలకుండా, తికమకకి తావులేకుండా దర్శకుడు దింజిత్ అయ్యతన్ స్క్రీన్‌ప్లే రాసుకుని ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.
సగం కాలిన పేపర్ ముక్కలతో వీడే మిస్టరీ
అప్పు పిళ్లై ఎవరికీ కనిపించకుండా కాల్చేసిన తన నోట్స్, ఆసుపత్రి రిపోర్ట్స్‌లో.. సగం కాలిన పేపర్ ముక్కల ఆధారంగా అపర్ణ ఈ సస్పెన్స్‌ను ఛేదించే విధానం ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తుంది. ఎంతలా అంటే.. చివరి 20 నిమిషాలే ఈ మూవీకి ప్రాణం. ఈ సినిమా ప్రధానంగా మూడు పాత్రల చుట్టూనే తిరుగుతంది. కానీ.. ఆద్యంతం ఎక్కడా మనకి బోర్ కొట్టదు. నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠ ఆఖరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు దింజిత్ అయ్యతన్ సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ సీన్స్ మనల్ని కంటతడి పెట్టిస్తాయి. అలానే సినిమా మొదటి నుంచి అప్పు పిళ్లైపై ఏర్పడే నెగటివ్ ఇంప్రెషన్‌ని ఒకే ఒక్క సీన్‌తో డైరెక్టర్ తుడిచిపెట్టేస్తాడు.
మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఓటీటీలో డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కిష్కింద కాండం మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా సరదాగా చూడొచ్చు.