Ananya Pandey: లీక్ చేస్తానంటూ షారుఖ్ ఖాన్ కుమారుడు బెదిరించాడు: హీరోయిన్ అనన్య పాండే
Ananya Pandey: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తనను బెదిరించాడని ఒకప్పటి విషయాలను హీరోయిన్ అనన్య పాండే గుర్తు చేసుకున్నారు. వ్లాగ్స్ లీక్ చేస్తానని అప్పట్లో భయపెట్టాడని చెప్పారు. ఆ వివరాలు ఇవే..
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ప్రధాన పాత్ర పోషించిన సీటీఆర్ఎల్ చిత్రం ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సైబర్ థ్రిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఏఐ టెక్నాలజీ, ఆన్‍లైన్‍లో ప్రైవసీ లాంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. సీటీఆర్ఎల్ మూవీ కోసం ఓ ప్రమోషనల్ వీడియోలో అనన్య మాట్లాడారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తనను బెదిరించారని వెల్లడించారు.
వ్లాగ్స్ లీక్ చేస్తానంటూ..
తన వ్లాగ్స్‌ను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని ఆర్యన్ ఖాన్ చిన్నప్పుడు బెదిరించే వాడని అనన్య ఈ వీడియోలో తెలిపారు. నెట్‍ఫ్లిక్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “నేను ఏం చేస్తానో.. ఏం తింటానో నేను ప్రతీ రోజు రికార్డు చేసేదాన్ని. కానీ ఎక్కడా పోస్ట్ చేయలేదు. నా దగ్గరే ఉండేవి. యాపిల్ ఫొటోబూత్ యాప్ నుంచి నేను, సుహానా, శనణ్య చాలా విషయాలు రికార్డ్ చేసే వాళ్లం. తాను చెప్పిన పని చేయకపోతే ఆ వీడియోలను లీక్ చేస్తానని ఆర్యన్ బెదిరించే వాడు” అని అనన్య చెప్పారు.
చిన్నప్పుడు ఈ విషయాలు జరిగాయని నవ్వుతూ అన్నారు అనన్య పాండే. అయితే, అప్పట్లో భయమేసిందని కూడా చెప్పారు. అప్పుడు ఆర్యన్‍తో ఎవరైనా మాట్లాడాల్సిందని నటుడు తన్మయ్ భట్ అన్నారు.
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, సంజయ్ కపూర్ కూతురు శనణ్య కపూర్‌తో అనన్య చిన్నప్పటి నుంచి ఫ్రెండ్‍గా ఉన్నారు. ఇప్పటికీ అనన్య, సుహానా కలిసి చాలా చోట్ల కనిపిస్తారు. ఐపీఎల్‍లోనూ షారూఖ్ టీమ్ ‘కోల్‍కతా నైట్‍రైడర్స్’ కు అనన్య సపోర్ట్ చేస్తుంటారు.
సుహానా నంబర్ లీక్
ఓ సందర్భంగా సుహానా ఖాన్ ఫోన్ నంబర్‌ను అనన్య పాండే పొరపాటున లీక్ చేశారు. ఇటీవల నెట్‍ఫ్లిక్స్ రిలీజ్ చేసిన వీడియోలో అనన్య ఈ విషయం చెప్పారు. “పొరపాటున సుహాన నంబర్‌ను నేను లీక్ చేశా. ఫేస్ టైమింగ్‍తో ఆమె కాల్ చేశా. సుహాన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో నేను స్క్రీన్‍షాట్ తీసుకున్నా. దాన్ని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశా. సుహాన నంబర్ ఆ ఫొటోలో ఉంది. ఆ తర్వాత సుహానా నాకు కాల్ చేసింది. నా నంబర్ హ్యాక్ అయిందని కంగారు పడింది. అవునా.. ఏమైంది అని నేను అడిగా. అయితే నేనే అలా చేశానని ఎవరో ఆమెకు చెప్పారు” అని అనన్య తెలిపారు.
తెలుగులో కూడా సీటీఆర్ఎల్
సీటీఆర్ఎల్ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్‍లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి వ్యూస్ సాధిస్తోంది. అనన్య పాండేతో పాటు విహాన్ సామ్రాట్, కామాక్షి భట్, దేవిక, సుచిత త్రివేది, రావిశ్ దేశాయ్ కీరోల్స్ చేశారు.
అనన్య పాండే ప్రస్తుతం శంకర అనే సినిమాలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ ఈ చిత్రం లీడ్ రోల్స్ చేస్తున్నారు. బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ రూపొందుతోంది.