Article 370 OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రియమణి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
Article 370 OTT Release Date: ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. బాలీవుడ్ లో ఈ మధ్యే హిట్ కొట్టిన ఈ సినిమాలో ప్రియమణి కూడా కీలకపాత్రలో నటించింది.
Article 370 OTT Release Date: థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది బాలీవుడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆర్టికల్ 370. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. శుక్రవారం (ఏప్రిల్ 19) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆర్టికల్ 370 ఓటీటీ రిలీజ్
ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఆర్టికల్ 370 మూవీకి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. రేపటి (ఏప్రిల్ 19) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ మూవీలో యామీ గౌతమ్ తోపాటు సౌత్ స్టార్ ప్రియమణి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మధ్యకాలంలో వస్తున్న తప్పుడు ప్రచారాల సినిమాల్లో ఇదీ ఒకటన్న విమర్శలు రిలీజ్ సమయంలో వచ్చాయి. అయితే ఆ విమర్శలను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిలబడింది. తొలి రోజే రూ.5.75 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాలి.
ఏంటీ ఆర్టికల్ 370 మూవీ?
జమ్ముకశ్మీర్ లోని ఉగ్రవాదం, అవినీతి ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఈ సినిమాలో యామీ గౌతమ్ ఓ ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో నటించింది. కశ్మీర్ లో ఉగ్రవాదం ఎలా చొరబడింది.. ఎలా వేళ్లూనుకుందో ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. ఆ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఎన్ఐఏలో చేరిన యామీ పాత్ర.. కశ్మీర్ ను ఎలా రక్షించిందన్నది ఇందులో చూడొచ్చు. ఆర్టికల్ 370 గురించి సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ సినిమాపై డైరెక్టర్ ఆదిత్య ధార్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. "ఈ సినిమా తీయడం వెనుక నా ఉద్దేశం సరైనది. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం నా ఉద్దేశం ఎప్పుడూ సరైనదిగానే ఉంటుంది. అది తప్పయిన రోజు సినిమాలు తీయడం ఆపేస్తాను. అందుకే ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను" అని అన్నాడు.
గతంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాల బాటలోనే ఈ ఆర్టికల్ 370 తీశారన్న విమర్శల నేపథ్యంలో అతడు ఇలా స్పందించాడు. “ఇదో తప్పుడు ప్రచార సినిమా అన్న విమర్శకుల మాటలు పట్టించుకోను. ఎందుకంటే ఆ తప్పుడు ప్రచారం అన్నది వాళ్ల మెదళ్లలో ఉంటుంది. ఆర్టికల్ 370 అనేది ఇండియా కేంద్రంగా తీసిన సినిమా. ఇదో అద్భుతమైన స్టోరీ. నేను విన్న బెస్ట్ స్టోరీల్లో ఇదీ ఒకటి” అని ఆదిత్య ధార్ అన్నాడు.
ఈ ఆర్టికల్ 370ని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ కు రాష్ట్రం హోదా కూడా తొలగించి దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.