ARM Trailer: మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో విజువల్ వండర్.. తెలుగులోనూ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్
ARM Trailer: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి మరో విజువల్ వండర్ వచ్చేస్తోంది. అక్కడి స్టార్ హీరో టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ ట్రైలర్ సోమవారం (ఆగస్ట్ 26) ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇది గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ARM Trailer: మలయాళం ఇండస్ట్రీ తక్కువ బడ్జెట్ తో ఎంతో అర్థవంతమైన సినిమాలు తీయడమే కాదు.. భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ మూవీస్ కూడా తీయగలమని నిరూపిస్తోంది. తాజాగా టొవినో థామస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఏఆర్ఎం మూవీ ట్రైలర్ రిలీజైంది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఏఆర్ఎం మూవీ
టొవినో థామస్ నటిస్తున్న మూవీ ఏఆర్ఎం. దీని పూర్తి పేరు అజయంతే రండం మోచనం. ఇది అతని కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా సోమవారం (ఆగస్ట్ 26) సినిమా ట్రైలర్ ను తెలుగులోనూ రిలీజ్ చేశాడు.
ఇదొక పీరియడ్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మూడు టైమ్ లైన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళం ఇండస్ట్రీ అందించబోతున్న మరో విజువల్ వండర్ గా భావిస్తున్నారు.
ఏఆర్ఎం ట్రైలర్
ఈ ఏఆర్ఎం మూవీ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఉత్తర కేరళలో 1900, 1950, 1990.. ఇలా మూడు కాలాల్లో జరిగిన స్టోరీగా ఈ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. దీంతో ఈ సినిమాలో టొవినో థామస్ కూడా మూడు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. ట్రైలర్ లోనే అతడు ఈ మూడు పాత్రల్లో తన భిన్నమైన నటన కనబరిచాడు.
మణియన్, కుంజికేలు, అజయన్ అనే మూడు పాత్రల్లో టొవినో థామస్ నటిస్తున్నాడు. మూడు తరాల్లోని నిధిని రక్షించే పనే అతనిది. ఇందులో కేరళ సాంస్కృతిక వైభవాన్ని కూడా చాటి చెప్పే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు. జితిన్ లాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ తో అతడు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
ఈ ఏఆర్ఎం మూవీలో కృతిశెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎం మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. సెప్టెంబర్ 12న ఆరు భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఊపు మీదున్న టొవినో థామస్
మలయాళం ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా పేరున్న టొవినో థామస్ కెరీర్లో 50వ సినిమాగా ఏఆర్ఎంగా తెరకెక్కుతోంది. అయితే ఈ మధ్యే రెండు వరుస హిట్స్ తో అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది వచ్చిన 2018 మూవీ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.
అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ ఏడాది అన్వేషిప్పిన్ కండెతుమ్ అనే మరో మర్డర్ మిస్టరీ సినిమాతోనూ టొవినో సక్సెస్ సాధించాడు.