Arjun vs Vishwak Sen: అర్జున్, విశ్వక్ సేన్ మధ్య ముదురుతున్న గొడవ.. ఇంతకీ ఏం జరిగింది?
Arjun vs Vishwak Sen: అర్జున్, విశ్వక్‌సేన్ మధ్య గొడవ ముదురుతోంది. విశ్వక్ అన్‌ఫ్రొఫెషనల్ అని, అతనిలో సినిమా చేయనని అర్జున్ అనడంతో దానికి విశ్వక్ కౌంటర్ వేశాడు.
Arjun vs Vishwak Sen: అర్జున్ సర్జా.. టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ సీనియర్ నటుడు. ఎన్నో దశాబ్దాలుగా సినీ ఫీల్డ్‌లో ఉన్నాడు. మరోవైపు విశ్వక్ సేన్ యువ నటుడు. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పుడీ ఇద్దరు నటుల మధ్య వివాదం నడుస్తోంది. విశ్వక్ అన్‌ప్రొఫెషనల్ అని, అతనితో సినిమా చేయనని అర్జున్ పబ్లిగ్గా చెప్పడంతో వివాదం మొదలైంది.
ట్రెండింగ్ వార్తలు
అర్జున్ పబ్లిగ్గా తనను విమర్శించడంతో విశ్వక్ కూడా ఓ ఈవెంట్‌లోనే దానికి సమాధానమిచ్చాడు. మొదట విశ్వక్ గురించి అర్జున్ స్పందిస్తూ.. "నాలుగు దశాబ్దాల నా కెరీర్‌లో విశ్వక్‌లాంటి అన్‌ప్రొఫెషనల్ నటుడిని నేను చూడలేదు. ఎవరూ నన్ను ఇంతగా అవమానించలేదు. అతని ప్రవర్తన నన్ను, నా టీమ్‌ను బాధించింది. అతనితో ఇక సినిమా చేయను" అని రెండు రోజుల కిందట అన్నాడు.
విశ్వక్ స్టోరీ సిట్టింగ్‌లకు రాడని, చివరి నిమిషంలో షూటింగ్‌లను రద్దు చేస్తాడన్న ఆరోపణలు వచ్చాయి. అతనికి కాల్ చేసినన్ని సార్లు ఎవరికీ చేయలేదని, కానీ ఎప్పుడూ సరిగా స్పందించలేదని కూడా అర్జున్ చెప్పాడు. ఈ ఇద్దరి సినిమా జూన్‌లో ప్రారంభమైంది. నాలుగేళ్ల తర్వాత అర్జున్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో అర్జున్ కూతురు ఐశ్వర్య తొలిసారి నటిస్తోంది.
అయితే అర్జున్ ఆరోపణలపై విశ్వక్ స్పందించాడు. అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తనను విమర్శించగా.. విశ్వక్ ఇప్పుడు రాజయోగం అనే మూవీ టీజర్ లాంచ్‌లో అతనికి కౌంటర్ ఇచ్చాడు. సినీ ఇండస్ట్రీలో తనంత నిబద్ధతతో పని చేసే హీరో లేడని విశ్వక్ అనడం విశేషం. "లైట్‌బాయ్స్ సహా ఇండస్ట్రీలో ఎవరైనా నన్ను అన్‌ప్రొఫెషనల్ అని అంటే నేను వెంటనే ఫీల్డ్ వదిలేసి వెళ్తాను. నేను దిల్ రాజు, సురేశ్ బాబులాంటి ఎంతో మంది పెద్ద ప్రొడ్యూసర్లతో పని చేశాను. నేను ఓ సినిమాకు 50 రోజులు షూటింగ్ చేస్తే 20, 30 రోజులు ప్రమోషన్లలో బిజీగా ఉంటాను" అని చెప్పాడు.
అర్జున్ సర్జా మూవీలు చిన్నతనం నుంచి చూస్తున్నానని, అతనంటే ఎంతో గౌరవం ఉందని అన్నాడు. కానీ అతనితో షూటింగ్ చేసే సమయంలో మాత్రం తాను కాస్త అసౌకర్యంగా ఫీలైనట్లు చెప్పాడు. తన తప్పేమైనా ఉందని అర్జున్ ఫీలైతే తాను క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. తాను స్క్రిప్ట్‌ను కాస్తా బెటర్ చేయడానికే ప్రయత్నించినట్లు తెలిపాడు. ఏదైనా ఉంటే తాను నాలుగు గోడల మధ్యే పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని, కానీ అర్జున్ మాత్రం మీడియా ముందు చెప్పడమేంటని ప్రశ్నించాడు.
టాపిక్