Arjun Kapoor: భయపడితే బరువు పెరుగుతాడట.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు.. ఫ్యామిలీ మొత్తానికి..
Arjun Kapoor: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తాను ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధి గురించి వెల్లడించాడు. డిప్రెషన్ తోపాటు హషిమోటో అనే వ్యాధి బారిన కూడా అతడు పడ్డాడు. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో అర్జున్ చెప్పుకొచ్చాడు.
Arjun Kapoor: అర్జున్ కపూర్.. బాలీవుడ్ నెపో కిడ్స్ లో ఒకడు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పటి వరకూ చెప్పుకోదగిన హిట్ మాత్రం అందుకోలేదు. ఈ మధ్యే సింగం అగైన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతడు.. తాను డిప్రెషన్ తో బాధపడటంతోపాటు తనకున్న అరుదైన వ్యాధి గురించి కూడా వెల్లడించాడు. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన అర్జున్.. తనకు హషిమోటో అనే వ్యాధి సోకినట్లు చెప్పాడు.
అర్జున్ ఏం చెప్పాడంటే..
అర్జున్ కపూర్ ఈ మధ్యే హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. “మన సినిమాలు ఆడనప్పుడు మనల్ని మనం అనుమానించుకోవడం మొదలుపెడతారు. నా విషయంలోనూ అదే జరిగింది. నా జీవితం సినిమాలే. సినిమాలు ఎంజాయ్ చేయడం మానేశాను. నేను అకస్మాత్తుగా ఇతరుల పనిని చూడటం ప్రారంభించాను. అలాగే 'నేను దీన్ని చేయగలనా లేదా నాకు అవకాశం లభిస్తుందా?' అని నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను. కొంత కాలం తర్వాత కచ్చితంగా ఏదో సమస్య ఉందని అర్థమైంది. ఆ తర్వాత థెరపీ మొదలుపెట్టాను” అని అర్జున్ చెప్పాడు.
“కొంతమంది థెరపిస్టుల దగ్గరికి వెళ్లాను, కానీ ప్రయోజనం లేదు. అప్పుడు నాకు ఒక వ్యక్తి దొరికాడు. అతను నన్ను మాట్లాడటానికి అనుమతించాడు. నేను డిప్రెషన్ లో ఉన్నానని చెప్పాడు. నేను దాని గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు” అని అర్జున్ తెలిపాడు. అంతేకాదు తాను 30వ ఏట ఉన్నప్పుడే హషిమోటో అనే వ్యాధి బారిన కూడా పడినట్లు వెల్లడించాడు.
“నాకు హషిమోటో (థైరాయిడ్ ను దెబ్బతీసే వ్యాధి) కూడా ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే.. నేను విమానంలో ప్రయాణిస్తుంటే, నేను ఏదో ప్రమాదంలో ఉన్నానని నా మనస్సు భావిస్తే, అప్పుడు నా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. నాకు 30 ఏళ్ల వయసులో ఈ వ్యాధి వచ్చింది. మా అమ్మకు కూడా ఈ వ్యాధి ఉంది, నా సోదరికి (అన్షులా కపూర్) ఈ వ్యాధి ఉంది” అని అర్జున్ కపూర్ చెప్పాడు.
ఒంటరితనంపై అర్జున్ ఏమన్నాండంటే?
అర్జున్ కపూర్.. మలైకాతో విడిపోయిన సంగతి తెలుసు కదా. మరి ఈ బ్రేకప్ తర్వాత ఒంటరిగా ఫీలవుతున్నారా అని అడిగినప్పుడు కూడా అతడు కాస్త భిన్నంగా స్పందించాడు. “అది 2014 అనుకుంటాను. నా తల్లిని కోల్పోయిన బాధ నుంచి మెల్లగా కోలుకుంటున్నాను. నా సోదరి కూడా ఢిల్లీలో ఉండటం ఇల్లు ఖాళీగా ఉంది. అదే సమయంలో నేను స్టార్ గా ఎదుగుతున్నాను.
కానీ నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆనందం లేదు. ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడమే చాలా ముఖ్యం. ఇది కాస్త సెల్ఫిష్ గా అనిపించొచ్చు కానీ అలా కాదు. ఇది ఒంటరితనమో మరేదో కాదు.. నా జీవితంలో జరిగిన ఓ ఘటన మాత్రమే” అని అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు.