Rasavathi OTT: తమిళ నటుడు అర్జున్ దాస్.. ఎక్కువగా నెగెటివ్ రోల్స్ చేశారు. ఖైదీ, మాస్టర్ సినిమాలతో అర్జున్‍కు మంచి గుర్తింపు వచ్చింది. విక్రమ్ చిత్రంలోనూ కనిపించారు. తెలుగులో ఆక్సిజన్, బుట్టబొమ్మ సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో అర్జున్ దాస్ నటిస్తున్నారు. అయితే, అర్జుస్ దాస్ ప్రధాన పాత్రలో రసవతి అనే తమిళ చిత్రం వచ్చింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది మే 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ రసవతి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‍ను ఖరారు చేసుకుంది.
రసవతి సినిమా ఈ శుక్రవారం జూన్ 21వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై నేడు (జూన్ 18) ఆహా అధికారిక ప్రకటన చేసింది. ఎమోషన్స్ రోలర్‌కోస్టర్‌కు సిద్ధమవండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే, రసవతి సినిమా తెలుగు డబ్బింగ్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి భవిష్యత్తులో అయినా ఈ మూవీ తెలుగు వెర్షన్‍ను ఆహా తీసుకొస్తుందో లేదో చూడాలి.
రసవతి చిత్రంలో అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. రేష్మ వెంకటేశ్, సుజీత్ శంకర్, జీఎం సుందర్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియం కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు.
రసవతి చిత్రానికి సంతకుమార్ దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీతో పాటు థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించారు. మే 10వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
కెరీర్లో ఎక్కువగా విలన్, సీరియస్ రోల్స్ చేస్తున్నారు అర్జున్ దాస్. అయితే, ప్రధాన పాత్రలో రసవతి సినిమాలో అతడి నటన ఆకట్టుకుంది. అతడిపై ప్రశంసలు వచ్చాయి.
సదాశివ పాండియన్ అలియాజ్ సదా (అర్జున్) కొడైకెనాల్‍లో డాక్టర్‌గా పని చేస్తుంటారు. అదే సిటీలో సూర్య (తాన్య రవిచంద్రన్) హోటల్ మేనేజర్ ఉద్యోగానికి చేరతారు. పాండియన్, సూర్య ఇద్దరూ తమ గతాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు. పరిచయం పెరుగుతుంది. ఆ తర్వాత ప్రేమలో పడతారు. ఈ క్రమంలో పరశురాజ్ (సుజీత్ శంకర్) కొడైకెనాల్‍కు ఇన్స్‌పెక్టర్‌గా వస్తాడు. పాండియన్ వల్ల గతంలో జరిగిన ఓ ఘటనతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే, పరశురాజ్‍తో తనకు ఏం సంబంధం ఉందోనని ఆలోచిస్తుంటాడు పాండియన్. అసలు పాండియన్ గతం ఏంటి? ఇన్స్‌పెక్టర్‌తో సంబంధం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందనేదే రసవతి మూవీ స్టోరీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
ఖైదీ, మాస్టర్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ అర్జున్ దాస్‍కు పాపులారిటీ వచ్చింది. తెలుగులో ప్రస్తుతం ఓజీ చిత్రంలో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఓజీ సినిమా అద్భుతంగా ఉంటుందని ఓ ట్వీట్ కూడా చేశారు. ఓజీలోని కొన్ని విజువల్స్ చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.
టాపిక్