అరి మూవీ రివ్యూ.. ఆరు బలహీనతలను ఎలా జయించాలో చెప్పే సినిమా.. అనసూయ, సాయి కుమార్‌ల కృష్ణతత్వం ఆకట్టుకుందా?-ari movie review in telugu and rating anasuya bharadwaj sai kumar viva harsha jayashankar ari explained telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అరి మూవీ రివ్యూ.. ఆరు బలహీనతలను ఎలా జయించాలో చెప్పే సినిమా.. అనసూయ, సాయి కుమార్‌ల కృష్ణతత్వం ఆకట్టుకుందా?

అరి మూవీ రివ్యూ.. ఆరు బలహీనతలను ఎలా జయించాలో చెప్పే సినిమా.. అనసూయ, సాయి కుమార్‌ల కృష్ణతత్వం ఆకట్టుకుందా?

Sanjiv Kumar HT Telugu

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ తదితరులు నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అరి. మైథలాజికల్ టచ్ ఇస్తూ తెరకెక్కిన ఈ మూవీకి జయశంకర్ దర్శకత్వం వహించారు. ఏడేళ్లపాటు పరిశోధన చేసిన జయశంకర్ తెరకెక్కించిన అరి మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో అరి రివ్యూలో తెలుసుకుందాం.

అరి మూవీ రివ్యూ.. ఆరు బలహీనతలను ఎలా జయించాలో చెప్పే సినిమా.. అనసూయ, సాయి కుమార్‌ల కృష్ణతత్వం ఆకట్టుకుందా?

టైటిల్: అరి

నటీనటులు: వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు

కథ, దర్శకత్వం: జయశంకర్

సంగీతం: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్, శివశంకర్ వర ప్రసాద్

ఎడిటింగ్: జి అవినాష్

నిర్మాతలు: శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్: అక్టోబర్ 10, 2025

మనిషిలోని అంతర్గత శత్రువులు లేదా బలహీనతలు అయిన అరిషడ్వర్గాలను ఎలా జయించాలో చెప్పేందుకు ప్రయత్నించిన సినిమా అరి. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. పేపర్ బాయ్ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన అరి ఇవాళ (అక్టోబర్ 10) థియేటర్లలో విడుదలైంది.

ఏడేళ్ల పరిశోధన

ఏడేళ్లపాటు పరిశోధన చేసి ఆరు ఇన్నర్ ఫీలింగ్స్‌ను ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పేందుకు తెరెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి అరి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

"ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును" అనే యాడ్ చూసి లైబ్రరిలో ఉండే సైకో అనే ఓ వ్యక్తి (వినోద్ వర్మ) దగ్గరికి ఆరుగురు తమ కోరికలో వస్తారు. వారిలో కోటీశ్వరుడైన విప్రనారాయణ పాశ్వాన్ (సాయి కుమార్), పోలీస్ ఆఫీసర్ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్), ఎయిర్ హోస్టెస్ ఆత్రేయ (అనసూయ భరద్వాజ్), సూర్య అనే దొంగ (పురిమెట్ల సూర్య), గృహిణి లక్ష్మీ (సురభి ప్రభావతి), టీ కొట్టులో పనిచేసే అమూల్ కుమార్ (వైవా హర్ష), వృద్ధుడైన గుంజన్ (శుభలేఖ సుధాకర్) ఉంటారు.

వీరంతా ఒక్కో కోరికతో వచ్చి తమ కోరికలను తీర్చమంటారు. దానికి సైకో ప్రతి ఒక్కరికీ ఒక టాస్క్ ఇచ్చి అది పూర్తి చేస్తే మీ కోరికలు తీరుస్తాను అని చెబుతాడు. అవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

ట్విస్టులు

మరి అవి ఎలాంటి టాస్క్‌లు? వాటితో వచ్చే సమస్యలు ఏంటీ? ఆ టాస్క్‌లను వారంతా పూర్తి చేశారా? ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు ఏంటీ? అసలు అందరి కోరికలు తీరుస్తానన్న సైకో ఎవరు? అనేది తెలియాలంటే అరి మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

అరి స్టోరీని, కాన్సెప్ట్‌ను దాదాపుగా ట్రైలర్‌లోనే చూపించారు దర్శకనిర్మాతలు. ఆ కాన్సెప్ట్‌తో సినిమా పూర్తయ్యేవరకు ఆడియెన్స్‌ సీట్‌లో ఎలా కూర్చోబెడతారన్నదే మిగతా విషయం. అయితే, అందులో డైరెక్టర్ జయశంకర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

లైబ్రరిలో ఉన్న వ్యక్తి కోరికలు తీరుస్తాననడం, వారి దగ్గరికి కొంతమంది వచ్చి వారి కోరికలు చెప్పడం, వారికో ఓ పని అప్పజెప్పడం అంతా ట్రైలర్‌లో చూపించారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వెండితెరపై ఆవిష్కరించారు.

అంతర్గత కోరికల గురించి

ఒక్కో పాత్ర కోరిక ఏంటీ, వారు అలా ఎందుకు కోరుకుంటున్నారు, దానికోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వంటి అంశాలు అన్నీ బాగున్నాయి. మనిషిలో అంతర్గతంగా ఉండే ఆరు కోరికలను పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పారు కానీ, వాటిని ఎలా జయించాలో చెప్పలేదు, అందుకోసమే ఈ సినిమా అన్నది దర్శకుడు అరిని తెరకెక్కించడానికి ప్రధాన కారణం.

అరి సినిమా చూశాక ఎంతమంది తమ కోరికలను కంట్రోల్ చేసుకుంటారో తెలియదు కానీ కోరికల వల్ల వచ్చే మంచి, చెడు ప్రభావం ఎలా ఉంటుందో మాత్రం డైరెక్టర్ బాగా చూపించారు. ఈ సినిమాకు పురాణాలు, ఇతిహాసాల వంటి మైథలాజికల్ టచ్ ఇస్తూ అర్థవంతంగా రూపొందించారు.

అరిషడ్వర్గాలుగా పిలిచే కామ‌, క్రోధ‌, లోభ‌, మోహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాలైన అంతర్గత శత్రువుల వల్ల పురాణాల్లో రావ‌ణుడు, దుశ్శాస‌నుడు, దుర్యోధ‌నుడు, హిర‌ణ్యాక్ష త‌దిత‌రులు ఎలా అంతమయ్యారో, ఇలాంటి కోరికలనే బలహీనలతలను మనిషి కంట్రోల్ చేసుకోగలిగితే ఎంత మంచి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చాలా మెచ్చుకోదగినది.

అర్థమయ్యేలా చెప్పడం

స్వర్గలోకంలో శ్రీ కృష్ణుడు కోరికతో మొదలై మనిషి బలహీనత వరకు చూపించిన ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇలాంటి కాన్సెప్ట్‌లను, ఆరుగురు డిఫరెంట్ కథలను అర్థమయ్యేలా చెప్పడం అంత సులువు కాదు. కానీ, తగిన జాగ్రత్తలతో అర్థవంతంగా ఆవిష్కరించారు. టాస్క్‌లు, వాటిని పరిచయం లేని వ్యక్తి చెబితే ఒప్పుకోవడం వంటివి సినిమాటిక్ లిబర్టిగా అనిపిస్తాయి.

ఆరు పాత్రలను కథకు ముడిపెట్టి బాగానే రక్తికట్టించారు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. విజువల్స్, సంగీతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా బాగున్నాయి. ఈ సినిమాతో డైరెక్టర్‌కు మంచి మార్కులు పడినట్లే. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

ఇక కోరికలతో నిండిపోయిన పాత్రలుగా ప్రతి ఒక్కరు బాగా పర్ఫార్మ్ చేశారు. పాత్రలతో వచ్చే సంభాషణలు, వారి డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. వైవా హర్ష కామెడీ నవ్విస్తుంది. సాయి కుమార్, అనసూయ నటన హైలెట్ అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలో వైవిధ్యం కనిపిస్తుంది.

కృష్ణతత్వంతో

ఇక వినోద్ వర్మ యాక్టింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కంపోజ్‌డ్‌గా నటనలో పరిణితి కనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కృష్ణతత్వంతో ఆరు కోరికల ప్రభావం గురించి చెప్పే సినిమా అరి.

రేటింగ్: 3/5

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం