AR Rahman: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పెళ్లయిన సుమారు 30 ఏళ్లకు భార్య సైరా బానుతో విడిపోతున్నాడు. ఈ ఇద్దరూ 1995లో పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ ఉన్నారు. తాము విడిపోతున్నట్లు ఈ జంట ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించడం గమనార్హం. దీనిపై తన గుండె ముక్కలైందంటూ అతడు ట్వీట్ చేశాడు.
ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోతున్నట్లు సైరా లాయర్ వందనా షా ఓ ప్రకటన జారీ చేశారు. అందులో ఏముందంటే.. "మిసెస్ సైరా, ఆమె భర్త అల్లారఖా రెహమాన్ తరఫున వందనా షా అండ్ అసోసియేట్స్ వాళ్లు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ ప్రకటన జారీ చేస్తున్నాం.
పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత వాళ్లు విడిపోవాలన్న ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ల బంధంలో ఎంతో సంఘర్షణ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా.. వాళ్ల బంధంలో వచ్చిన సమస్యలు, ఉద్రిక్తలు వాళ్ల మధ్య దూరాన్ని పెంచాయి. అందుకే సైరా, రెహమాన్ ఇద్దరూ విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చారు" అని ఆ ప్రకటన తెలిపింది. ఈ సందర్భంగా వాళ్ల తనయుడు అమీన్ ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన కుటుంబ ప్రైవసీని గౌరవించాలని కోరాడు.
రెహమాన్‌ది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అతని తల్లి ఈ పెళ్లిని ఖాయం చేసింది. ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట సిమి గరెవాల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చెప్పాడు. తనకు కనీసం పిల్లను చూసే సమయం కూడా లేకపోవడంతో ఆ పనిని తన తల్లికి అప్పగించినట్లు అప్పట్లో రెహమాన్ తెలిపాడు.
29 ఏళ్ల వయసులో రెహమాన్ పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లి సమయానికి అతడు రోజా, బొంబాయిలాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాల మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత అతనికి తిరుగు లేకుండా పోయింది. 2009లో ఆస్కార్ గెలిచే వరకూ అతని ప్రస్తానం సాగిపోయింది. దేశమే కాదు ప్రపంచమే మెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్లలో ఒకడిగా రెహమాన్ ఎదిగాడు. రెహమాన్ కూతురు ఖతీజా 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
భార్యతో విడిపోవడంపై రెహమాన్ ఓ ట్వీట్ ద్వారా స్పందించాడు. "30 ఏళ్ల సెలబ్రేషన్ వరకు వెళ్తామని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. పగిలిన గుండెలను చూసి ఆ దేవుడు కూడా కంపించిపోయి ఉంటాడు.
అయితే ఇందులోనూ మేము సారాన్ని వెతుక్కుంటాం. ఆ ముక్కలు మళ్లీ కలవవు. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవిస్తున్న అందరికీ కృతజ్ఞతలు" అని రెహమాన్ ట్వీట్ చేశాడు.