Anurag Kashyap: బాలీవుడ్ పుష్పలాంటి సినిమా తీయలేదు.. ముంబై వదిలి సౌత్‌కి వెళ్లిపోతున్నా: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Anurag Kashyap: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే నటించడానికి తాను ముంబైని వదిలేస్తున్నానని చెప్పాడు. బాలీవుడ్ ఎప్పటికీ బాగుపడదు అని, పుష్పలాంటి సినిమా కూడా తీయలేదని అతడు అనడం గమనార్హం.
Anurag Kashyap: బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకడు అనురాగ్ కశ్యప్. హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, రమన్ రాఘవ్ 2.0, బాంబే టాకీస్ లాంటి హిట్ సినిమాలు తీసిన అతడు.. ఇప్పుడు అక్కడి ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలపై దృష్టి సారిస్తున్న అతడు.. ఇక తాను ముంబైని వదిలేస్తున్నానని, బాలీవుడ్ ఎప్పటికీ బాగుపడదు అన్నట్లుగా మాట్లాడటం గమనార్హం.
ముంబై వదిలి సౌత్ వైపు ప్రయాణం
అనురాగ్ కశ్యప్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను సౌత్ కు వెళ్లిపోతున్నట్లు వెల్లడించాడు. "వాళ్లను (సౌత్ ఫిల్మ్ మేకర్స్) చూస్తే నాకు అసూయ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో ప్రయోగం చేయడం కష్టం. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించాలి.
మా ప్రొడ్యూసర్లు లాభాల గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సినిమా మొదలు పెట్టక ముందే దానిని ఎలా అమ్మాలన్నదానిపై ఆలోచిస్తున్నారు. అందువల్ల సినిమా చేయాలన్న ఆ ఆసక్తి పోతోంది. అందుకే నేను వెళ్లిపోతున్నాను. వచ్చే ఏడాదే ముంబై వదిలేస్తున్నాను" అని అనురాగ్ కశ్యప్ అన్నాడు.
బాలీవుడ్ పుష్పలాంటి సినిమా కూడా తీయలేదు
ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై అనురాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాను బాలీవుడ్ ఎప్పటికీ చేయలేదని, అలాంటి సినిమా వస్తే వాటి రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడానికి మాత్రం ముందుంటుందని అన్నాడు. హిందీ సినిమా కొత్తగా ఏమీ చేయలేదని అనురాగ్ స్పష్టం చేశాడు. పుష్పలాంటి సినిమాను కూడా బాలీవుడ్ చేయలేదని అతడు అన్నాడు.
"వాళ్లు తీయలేరు. ఎందుకంటే వాళ్లకు సినిమా తీసే మెదళ్లు లేవు. ఫిల్మ్ మేకింగ్ ఏంటో వాళ్లకు తెలియదు. పుష్పను సుకుమార్ తీశాడు. సౌత్ లో ఓ ఫిల్మ్ మేకర్ పై పెట్టుబడి పెడతారు. దర్శకులకు సాధికారత ఇచ్చే బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఒకరు సురేష్ బాబు, రానా తండ్రి. ఎంతో మంది దర్శకులకు సాధికారత కల్పించిన ఘనత అతని సొంతం. కానీ హిందీలో మాత్రం అతడు చెప్పింది ఎందుకు వినరో అర్థం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఓ ఫార్ములా క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తారు. ఒకటి వర్కౌట్ అయిందంటే అందరూ దానిని ఫాలో అవుతారు. వాళ్లకు ఈగో ఎక్కువ. వాళ్లకు వాళ్లు దేవుళ్లు అనుకుంటారు. కానీ అది అహంకారం" అని అనురాగ్ తీవ్రంగా మండిపడ్డాడు.
అనురాగ్ కశ్యప్ తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి మహారాజా అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సంచలన విజయం సాధించింది. అనురాగ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో అతడు మరిన్ని సౌత్ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ మధ్యే రైఫిల్ క్లబ్, విడుదల పార్ట్ 2లలోనూ అతడు నటించాడు.