Bahishkarana OTT Release Date: మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బహిష్కరణ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. వేశ్య పాత్రలో అంజలి
Bahishkarana OTT Release Date: బహిష్కరణ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సిరీస్‍లో అంజలి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సిరీస్ రిలీజ్ డేట్, మరిన్ని వివరాలను ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది.
తెలుగు నటి అంజలి ఇటీవలే 50 సినిమాల మార్క్ దాటారు గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీతో ఆమె 50 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అంజలి ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ బహిష్కరణ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
బహిష్కరణ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 19వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (జూలై 4) అధికారికంగా ప్రకటించింది. ప్రేమ, మోసం, ప్రతీకారం ఉండే సిరీస్ వస్తోందంటూ జీ5 వెల్లడించింది. జూలై 19 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.
వేశ్యగా అంజలి
బహిష్కరణ వెబ్ సిరీస్‍లో పుష్ప అనే వేశ్యగా అంజలి నటించారు. అమాయకమైన వేశ్య నుంచి అసమానతనలు ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని కూడగట్టుకునే మహిళ ప్రయాణం ఈ సిరీస్‍లో ఉంటుందని అంజలి చెప్పారు. ఈ సిరీస్‍లో అంజలితో పాటు రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మమ్మద్ బాషా కీలకపాత్రలు పోషించారు.
బహిష్కరణ సిరీస్‍కు ముకేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‍ను విక్సెల్ పిక్చర్ ఇండియా పతాకంపై ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తుండగా.. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందిస్తున్నారు.
బహిష్కరణ స్టోరీలైన్
బహిష్కరణ సిరీస్ 1990ల గుంటూరు రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది. పెద్దపల్లి గ్రామంలో పనికి వెళ్లిన దర్శి అనే ఓ వ్యక్తి ఓ రోజు ఇంటికి తిరిగిరాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. దీంతో ఓ రహస్యమైన గతం ఉన్న పుష్ప అనే వేశ్య, దర్శి, అతడి భార్య లక్ష్మి మధ్య సంబంధాలు బయటికి వస్తాయి. రహస్యాలు క్రమంగా బయపడతాయి. ఈ క్రమంలో ప్రేమ, మోసం, కొన్ని విషాదాలతో కూడిన మలుపులు ఇలా ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది. ఆ గ్రామ సర్పంచ్ శివయ్య కూడా ఈ కథలో కీలక పాత్రగా ఉంటాడు. పుష్ప, లక్ష్మి తమకు అన్యాయం జరిగిందని ఓ దశలో గుర్తిస్తారు. సమాజ కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. గతం ఎలాంటి పరిణామాలు జరిగాయి.. సవాళ్లను పుష్ప, లక్ష్మి ఎలా ఎదుర్కొన్నారనేదే బహిష్కరణ ప్రధాన స్టోరీగా ఉండనుంది.
జీ5లో ‘కకుడా’
జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హిందీ హారర్ కామెడీ సినిమా కకుడా జూలై 12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. సోనాక్షి సిన్హా, రితేశ్ దేశ్‍ముఖ్, షకీబ్ సలీమ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఆసిఫ్ ఖాన్, సచిన్ విద్రోహి, అరుణ్ దూబే, సూరజ్ రాజ్ మధ్వానీ కీరోల్స్ చేశారు. ఆదిత్య సర్పోర్ట్‌దార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆర్ఎస్‍వీపీ పతాకంపై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రానికి గుల్‍రాజ్ సింగ్ సంగీతం అందించారు. జూలై 12 నుంచి జీ5 ఓటీటీలో కకుడా మూవీని వీక్షించుచొచ్చు.