Animal TV Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న యానిమల్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
Animal TV Premiere Date: థియేటర్లు, ఓటీటీని ఊపేసిన తర్వాత యానిమల్ మూవీ ఇప్పుడు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మూవీ హిందీ వెర్షన్ సోనీ మ్యాక్స్ ఛానెల్లోకి రాబోతోంది.
Animal TV Premier Date: సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి హిందీ వెర్షన్ మాత్రమే సోనీ మ్యాక్స్ ఛానెల్లోకి రానుంది. మిగతా భాషల్లో ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదు.
యానిమల్ టీవీ ప్రీమియర్ డేట్
యానిమల్ మూవీ టీవీ ప్రీమియర్ తేదీని సోనీ మ్యాక్స్ ఛానెల్ అనౌన్స్ చేసింది. వచ్చే ఆదివారం (మార్చి 17) రాత్రి 7 గంటలకు యానిమల్ హిందీ వెర్షన్ ను టెలికాస్ట్ చేయనున్నట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. ఇప్పటికే థియేటర్లు, ఓటీటీలో యానిమల్ మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ లోనూ రికార్డులు సొంతం చేసుకుంది.
ఇప్పుడు టీవీలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. థియేటర్లు, ఓటీటీల్లో హిట్ అయిన సినిమాలు టీవీల్లోనూ రికార్డు టీఆర్పీలు సొంతం చేసుకోవడం ఈ మధ్యకాలంలో మనం చూశాం. ఇప్పుడు యానిమల్ మూవీ కూడా అందుకు భిన్నమేమీ కాదు. హిందీ వెర్షన్ కావడంతో నార్త్ బెల్ట్ లో ఈ సినిమాను టీవీల్లోనూ ఎగబడి చూసే అవకాశం ఉంది.
ఓటీటీలో యానిమల్ రికార్డు
గతేడాది డిసెంబర్ 1న రిలీజైన యానిమల్ మూవీపై తొలి షో నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ అసలు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి వారంలోనే 2.08 కోట్ల వ్యూయింగ్ హవర్స్ తో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది.
అంతేకాదు కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్ ఇండియన్ మూవీస్ లో తొలి స్థానంలో కొనసాగింది. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టి 45 రోజులు అవుతున్నా.. ఏడో స్థానంలో యానిమల్ మూవీ కొనసాగుతోంది. గుంటూరు కారం, డంకీ లాంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నా కూడా యానిమల్ దూకుడు కొనసాగుతూనే ఉంది.
యానిమల్ మూవీపై హెచ్‌టీ తెలుగు రివ్యూ ఇదీ
యానిమల్ సినిమాలో వైలెన్స్ ఓవర్ డోస్‍లో ఉంది. మోస్ట్ వైలెంట్ మూవీగా ఈ చిత్రాన్ని తీసుకొస్తానని చెప్పిన మాటను సందీప్ రెడ్డి వంగా చేసి చూపించారు. యాక్షన్ సీన్లలో హింస ఎక్కువైంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇదే రీతిలో సాగింది. అలాగే, బోల్డ్ డైలాగ్‍లు కూడా ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఇక లిప్‍లాక్‍లు బోలెడు. ఏ సర్టిఫికేట్ చిత్రంలాగే ఈ మూవీ సాగింది.
యానిమల్ కథను తాను రాసుకున్న విధంగా తెరకెక్కించడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దాదాపు సక్సెస్ అయ్యాడు. ఎఫెక్టివ్‍గా రూపొందించాడు. రైటింగ్‍లోనూ తన మార్క్ చూపించాడు. దాయాదుల మధ్య పోరు అనే కథ కొత్తది కాకపోయినా.. సందీప్ మార్క్ టేకింగ్ ఆకట్టుకుంది. ఈ మూవీ ఎంగేజింగ్‍గా అనిపించడంలో స్క్రీన్‍ప్లే ముఖ్యమైన పాత్ర పోషించింది.