Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ఇక యానిమల్ మూవీ టీమ్ నుంచి రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్లో సందడి చేశారు.
అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబులను కలిసి ఒకే స్టేజ్ పై చూడటం ప్రత్యేకంగా అనిపించింది. ఈ యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన మహేష్ ను స్టేజ్ పైకి పిలిచిన సందర్భంగా అతని పోకిరి సినిమాలో పాటకు అనిల్ కపూర్ రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. అయితే మహేష్ మాత్రం సిగ్గుపడుతూ అతన్ని అలా చూస్తుండిపోయాడు.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మహేష్ బాబు.. తాను రణ్‌బీర్ కి పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. “ఇంతకుముందు కూడా రణ్‌బీర్ కి చెప్పాను. కానీ అతడు అంత సీరియస్ గా తీసుకున్నట్లు లేడు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ పై నుంచి చెబుతున్నాను. నేను రణ్‌బీర్ కి వీరాభిమానిని. ఇండియాలో అతడే బెస్ట్ యాక్టర్. యానిమల్ లో తన అత్యుత్తమ నటన కనబరిచాడు. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్” అని మహేష్ అన్నాడు.
ఈ సందర్భంగా మహేష్ గురించి రణ్‌బీర్ మాట్లాడుతూ.. జై బాబు.. జై బాబు అని అనడం విశేషం. తాను కలిసి తొలి సూపర్ స్టార్ మహేష్ అని ఈ బాలీవుడ్ స్టార్ చెప్పాడు. "నేను కలిసిన తొలి సూపర్ స్టార్ మహేష్ బాబు. నేను ఒక్కడు సినిమా చూశాను. అప్పుడే మహేష్ కు మెసేజ్ చేశాను. అతడు రిప్లై ఇచ్చాడు. ఈరోజు మా సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మహేష్ సర్ కి థ్యాంక్స్" అని రణ్‌బీర్ అన్నాడు.
ఇక ఈ ఈవెంట్ సందర్భంగా స్టేజ్ పై యానిమల్ ట్రైలర్ లో అనిల్ కపూర్, రణ్‌బీర్ మధ్య వచ్చే సీన్ ను రీక్రియేట్ చేశారు. డైరెక్టర్ సందీప్, రణ్‌బీర్ ఈ సీన్ రీక్రియేట్ చేయడం విశేషం. ఈ ఈవెంట్ లో మరో స్పెషల్ అట్రాక్షన్ దర్శక ధీరుడు రాజమౌళి. అతడు మాట్లాడుతూ.. ఈ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపించాడు.
"కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు సంపాదిస్తారు. అవి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడోసారి ఓ డైరెక్టర్ వస్తాడు. అతడు ఆడియెన్స్ ను షేక్ చేస్తాడు. ఇండస్ట్రీని షేక్ చేస్తాడు. సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. నాకు తెలిసిన నా తరంలో నేను చూసిన అలాంటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పుడు అలాంటి డైరెక్టరే సందీప్ రెడ్డి వంగా. సినిమా ఇలాగే తీయాలన్న రూల్ పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా" అని సందీప్ ను ఉద్దేశించి రాజమౌళి అనడం విశేషం.