Andhakaaram Review: అంధకారం రివ్యూ.. భయంతో మతిపోగొట్టే ఓటీటీ హారర్ మూవీ.. హైలెట్ ట్విస్టులతో ఎలా ఉందంటే?
Andhaghaaram Review In Telugu: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సాధించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ అంధకారం ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో అంధకారం రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: అంధకారం
నటీనటులు: వినోద్ కిషన్, అర్జున్ దాస్, కుమార్ నటరాజన్, పూజా రామచంద్రన్, జీవా రవి, మిషా ఘోషల్, రాయిల్ రవి, అరుల్ విన్సెంట్ తదితరులు
కథ, దర్శకత్వం: వి విగ్నరాజన్
నిర్మాతలు: ప్రియ అట్లీ, సుధన్ సుందరం, జయరాం, కే పూర్ణ చంద్ర
సంగీతం: ప్రదీప్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఏఎమ్ ఎడ్విన్ సాకాయ్
నిర్మాణ సంస్థ: ఏ ఫర్ యాపిల్ ప్యాషన్ స్టూడియోస్, ఓ2 పిక్చర్స్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
Andhakaaram Movie Review In Telugu: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 2020 సంవత్సరం నాటి సినిమా అంధగారం. ఒక డిఫరెంట్ హారర్ సెకాలజీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ అందుకుంది. తమిళ దర్శకుడు విగ్నరాజన్ డెబ్యూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో అంధకారం టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో అంధకారం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అంధకారం సినిమా అంధుడైన సూర్యం (వినోద్ కిషన్), క్రికెట్ కోచ్ వినోద్ (అర్జున్ దాస్), సైకాలజిస్ట్ డాక్టర్ ఇంద్రాన్ (కుమార్ నటరాజన్) అనే మూడు పాత్రల చుట్టు తిరుగుతుంది. అంధుడైన సూర్యం ప్రభుత్వ పాత లైబ్రరీలో క్లర్క్‌గా పనిచేస్తుంటాడు. తనకున్న బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు.
మరోవైపు వినోద్ డిప్రెషన్‌ను ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ ఇంద్రాన్‌ను తన పేషంట్ గన్‌తో షూట్ చేసి తాను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. బుల్లెట్ ఇంద్రాన్ గొంతు నుంచి వెళ్లడంతో వోకల్ దెబ్బతిని ప్రాణాలతో బయటపడతాడు.
సూర్యం, వినోద్, ఇంద్రాన్ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటీ? తన పేషంట్స్‌కు ఇంద్రాన్ ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడు? వినోద్ ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్లాడు? క్లర్గ్‌గా పనిచేస్తున్న సూర్యంకు రూ. 80 వేలు ఎందుకు అవసరం అయ్యాయి?
ఆ డబ్బు కోసం ఎలాంటి పని చేశాడు? తన దగ్గర ఉన్న టెలిఫోన్‌తో సూర్యం చేస్తాడు? చివరికీ సూర్యానికి ఏమైంది? సూర్యం తండ్రి ఏం చేసేవాడు? సూర్యం టీచర్ పూజా (పూజా రామచంద్రన్) పాత్ర ఏంటీ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే అంధకారం కచ్చితంగా చూడాల్సిందే.
విశ్లేషణ:
కొన్ని సినిమాలు స్పష్టంగా అర్థం అవుతూ సాఫీగా సాగిపోతుంటాయి. కానీ, మరికొన్ని చిత్రాలు ఆడియెన్స్ బ్రెయిన్‌కు పదును పెడతాయి. అలాంటి హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీనే అంధకారం. పూర్తి నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో కంప్లీట్ స్టోరీ చెప్పకుండా చివరి వరకు ఎంగేజ్ చేసిన సినిమా ఇది.
క్లైమాక్స్ వరకు సస్పెన్స్
ఐదుగురు ఒకేసారి సూసైడ్ చేసుకోవడంతో స్టార్ట్ అయిన ఈ మూవీ నిదానంగా సాగిన ఎంగేజ్ చేస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నలు మొదటి నుంచి ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వాటిలో చాలా వరకు మనం గెస్ చేసేవిధంగా ఉన్నప్పటికీ, విలన్ ఎవరనేది అర్థమైనప్పటికీ కంప్లీట్ స్టోరీ ఏంటీ అనేది మాత్రం చివరి వరకు సస్పెన్స్‌గానే ఉంచేలా తెరకెక్కించారు డైరెక్టర్.
అర్థం కానీ స్క్రీన్ ప్లే
అయితే, సినిమాలో ఎన్నో ప్లస్‌లు ఉన్నప్పటికీ మూవీ రన్ టైమ్ మాత్రం చాలా మైనస్ అని చెప్పుకోవాలి. సుమారు 3 గంటల రన్ టైమ్ ఉన్న అంధకారం ఎక్కడ ఓ చోట కాస్తా విసుగు తెప్పిస్తుంది. అంతా సేపు చూసిన ప్రేక్షకుడికి సినిమా పూర్తిగా అర్థమయ్యే అవకాశం కూడా లేదు. రెండు సార్లు చూస్తే తప్ప అర్థం కాని స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది.
ఆడియెన్స్‌కు పజిల్
పార్ట్ పార్టులుగా సీన్స్ చూపిస్తూ కంప్లీట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అంధకారం తెరకెక్కించారు. టెక్నీకల్లీ ఇది బ్రిలియంట్ వర్క్ అయినప్పటికీ కామన్ ఆడియెన్స్‌కు కాస్తా పజిల్‌లా ఉంటుంది. ఇటీవల విజయ్ సేతుపతి మహారాజా స్క్రీన్ ప్లేకు ఎంతటి ప్రంశసలు వచ్చాయో తెలిసిందే. అలాంటి నాలుగేళ్ల క్రితమే అలాంటి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన డైరెక్టర్ విగ్నరాజన్‌ను మెచ్చుకోవాల్సిందే.
సినిమాటిక్ థ్రిల్లింగ్ మూవీ
సినిమాలోని విషయాల గురించి చెబితే కచ్చితంగా స్పాయిలర్ అవుతుంది. కాబట్టి, సైకలాజికల్‌గా భయపెట్టే సీన్స్, నటీనటుల పర్ఫామెన్స్‌తో ఆద్యంతం ఎంగేజింగ్‌గా చేయడమే కాకుండా మంచి సినిమాటిక్ థ్రిల్ ఇచ్చే అంధకారంను మూవీ లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా.
హైలెట్‌గా వినోద్ యాక్టింగ్
ఇక అంధుడిగా వినోద్ కిషన్ పర్ఫామెన్స్ అద్భుతం. ఆ రోల్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా నటించారు. అర్జున్ దాస్, కుమార్ నటరాజన్, పూజా రామా చంద్రన్‌తోపాటు ఇతర నటీనటులు యాక్టింగ్ చాలా బాగుంటుంది. అందుకే సినిమా రన్ టైమ్ ఎక్కువ ఉన్న మూవీకి అలాగే స్టిక్ అయి ఉంటాం. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పర్ఫెక్ట్‌గా ఉండి భయపెడతాయి.