Andaru Bagundali Andulo Nenundali Movie Review: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ రివ్యూ-andaru bagundali andulo nenundali movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Andaru Bagundali Andulo Nenundali Movie Review

Andaru Bagundali Andulo Nenundali Movie Review: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ రివ్యూ

Nelki Naresh Kumar HT Telugu
Oct 28, 2022 11:03 AM IST

Andaru Bagundali Andulo Nenundali Movie Review: అలీ, న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా డైరెక్ట్‌గా ఆహా ఓటీటీ ద్వారా నేడు విడుద‌లైంది.

అలీ, న‌రేష్‌,
అలీ, న‌రేష్‌,

Andaru Bagundali Andulo Nenundali Movie Review: అలీ, న‌రేష్‌, ప‌విత్రాలోకేష్‌, మౌర్యాని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీ ద్వారా నేడు విడుద‌లైంది. మ‌ల‌యాళ చిత్రం వికృతి ఆధారంగా ద‌ర్శ‌కుడు శ్రీపురం కిర‌ణ్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సోష‌ల్ మెసేజ్‌కి కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

Andaru Bagundali Movie Plot- అంద‌రూ బాగుండాలి క‌థ‌ …

శ్రీనివాస‌రావు (న‌రేష్‌) మూగ వ్య‌క్తి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన అత‌డు క‌ష్ట‌ప‌డి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కూతురిని గొప్ప ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ చేయాల‌న్న‌ది అత‌డి క‌ల‌. కొడుకు ఆరోగ్యం బాగా లేక‌పోతే అత‌డి బాగోగులు చూసుకోవ‌డానికి రెండు రోజులు నిద్ర‌లేకుండా హాస్పిట‌ల్‌లో ఉంటాడు శ్రీనివాస‌రావు. తిరిగి ఇంటికి వ‌స్తోన్న క్ర‌మంలో అలిసిపోయి మెట్రో ట్రైన్‌లో గాఢంగా నిద్ర‌పోతాడు.

శ్రీనివాస‌రావును తాగుబోతుగా పొర‌ప‌డిన స‌మీర్ అనే వ్య‌క్తి అత‌డుట్రైన్‌లో నిద్ర‌పోయిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ ఫొటో వైర‌ల్ కావ‌డంతో శ్రీనివాస‌రావు వ్య‌క్తిగ‌త జీవితం మొత్తం త‌ల‌క్రిందుల‌వుతుంది. అంద‌రూ అత‌డిని తాగుబోతు అంటూ అవ‌మానిస్తుంటారు శ్రీనివాస‌రావు ఉద్యోగం పోవ‌డ‌మే కాకుండా కూతురు ఫుట్‌బాట్ ఆట‌కు దూరం అవ్వాల్సివ‌స్తోంది.

తాను చేయ‌ని త‌ప్పుకు శ్రీనివాస‌రావు ఎందుకు శిక్ష‌ను అనుభ‌వించాడు? సోష‌ల్ మీడియా పిచ్చితో త‌ప్పొప్పుల గురించి ఆలోచించ‌కుండా స‌మీర్ చేసిన ప‌ని శ్రీనివాస‌రావు జీవితంలో ఎలాంటి క‌ల్లోలాన్ని రేపింది? త‌న త‌ప్పును స‌మీర్ స‌రిదిద్దుకున్నాడా? అత‌డికి పోలీసులు ఎలా బుద్దిచెప్పారు అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

Story Analysis- సోష‌ల్ మీడియా పిచ్చితో...

సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిన త‌ర్వాత ఓవ‌ర్‌నైట్‌లో సెల‌బ్రిటీలుగా మారిపోవాల‌ని యువ‌త క‌ల‌లు కంటున్నారు. కొన్ని సార్లు తాము పాపుల‌ర్ అవ్వ‌డం కోస‌మో, స‌ర‌దా కోస‌మో విచ‌క్ష‌ణ మ‌ర‌చిపోయి తొంద‌ర‌పాటుతో ఇత‌రుల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వారి జీవితాల‌ను ఎలా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌నే క‌థ‌తో అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా రూపొందింది.

అస‌లు నిజం ఏమిటో తెలుసుకోకుండా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వ‌ల్ల ఓ సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడో హృద‌యాల్ని హ‌త్తుకునేలా సినిమాలో చూపించారు. సోష‌ల్ మీడియాను మంచి కోస‌మే ఉప‌యోగించుకోవాలి గానీ చెడు కోసం కాద‌నే సందేశాన్నిఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు. సోష‌ల్ మీడియాలో క‌నిపించే పోస్ట్‌ల‌లో నిజానిజాలు తెలుసుకోకుండా షేర్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని చాటిచెప్పారు.

మ‌ల‌యాళ రీమేక్‌...Andaru Bagundali Andulo Nenundali Movie Review

మ‌ల‌యాళ సినిమా వికృతికి ఇది రీమేక్‌. మ‌ల‌యాళ మాతృక‌లోని మెయిన్ పాయింట్‌ను తీసుకొని తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు శ్రీపురం కిర‌ణ్ అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాను తెర‌కెక్కించాడు. సోష‌ల్ మెసేజ్‌తో ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించాడు. మెసేజ్‌తో పాటు అలీ ల‌వ్‌స్టోరీని అంత‌ర్లీనంగా న‌డిపిస్తూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

Actors Performance -న‌రేష్‌, అలీ న‌ట‌న ప్ల‌స్‌...

మూగ‌వ్య‌క్తిగా న‌రేష్ చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. తాను చేయ‌ను త‌ప్పుకు శిక్ష‌ను అనుభ‌వించే మూగ వ్య‌క్తిగా ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో అత‌డి న‌ట‌న క‌దిలిస్తుంది. సోష‌ల్ మీడియాకు బానిస‌గా మారిన యువ‌కుడిగా అలీ క‌నిపించాడు. అనుక్ష‌ణం భ‌య‌ప‌డే అత‌డి పాత్ర నుంచి చ‌క్క‌టి కామెడీని జ‌న‌రేట్ చేశాడు డైరెక్ట‌ర్‌.

న‌రేష్ భార్య‌గా ప‌విత్రా లోకేష్ క‌నిపించింది. వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్ లో ఫ్యామిలీ ఎమోష‌న్స్ బ‌లంగా పండాయి. అలీని పెళ్లి చేసుకునే యువ‌తిగా మౌర్యాని క‌నిపించింది. అలీ త‌ల్లి పాత్ర‌లో మంజు భార్గ‌వి క్లైమాక్స్‌లో త‌న న‌ట‌న‌తో మెప్పించింది. న‌ట‌న‌ప‌రంగా ప్ర‌తి ఒక్కరూ త‌మ అనుభ‌వంతో పాత్ర‌ల‌కు ప్రాణంపోశారు.

నిదాన‌మే మైన‌స్‌...

అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా కోసం ఎంచుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా సీరియ‌ల్ త‌ర‌హాలో క‌థ‌నాన్ని నిదానంగా న‌డిపించారు ద‌ర్శ‌కుడు. కామెడీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. సెకండాఫ్‌లో అలీలో మార్పు వ‌చ్చే సీన్స్ బ‌లంగా రాసుకుంటే బాగుండేది. ఈ క‌థ‌కు పాట‌లు అవ‌స‌రం లేద‌ని అనిపించింది. సినిమా నిడివి పెంచ‌డానికే అవి ఉప‌యోగ‌ప‌డ్డాయి. అలీ, మౌర్యానీ పెళ్లి క‌థ‌ను అందంగా మ‌ల‌చ‌లేక‌పోయారు.

ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. స‌మ‌కాలీన స‌మ‌స్య‌ను అర్థ‌వంతంగా ఇందులో చూపించారు. కానీ క‌మ‌ర్షియాలిటీ దూరంగా సాగే అర్ట్ సినిమాగా సాగ‌డంతో యూత్ ఆడియెన్స్ ను మెప్పించ‌డం కొంత క‌ష్ట‌మే.

రేటింగ్: 2.5/5

IPL_Entry_Point