Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ నటిస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ గం గం గణేశా మూవీ ట్రైలర్ సోమవారం (మే 20) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అంతా ఆసక్తికర మలుపులతో సాగిపోయింది.
Gam Gam Ganesha Trailer: ప్రముఖ నటుడు ఆనంద్ దేవరకొండ బేబీ తర్వాత ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పేరు గం గం గణేశా. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ సోమవారం (మే 20) రిలీజైంది. ఇది చూస్తుంటే జానర్ కు తగినట్లే కామెడీతోపాటు కాస్త క్రైమ్, థ్రిల్ ఉన్న సినిమాలాగే అనిపిస్తోంది.
గం గం గణేశా ట్రైలర్
బేబి మూవీతో కెరీర్లోనే అతిపెద్ద హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు గం గం గణేశా పేరుతో మరో సరికొత్త జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో అతడో దొంగగా కనిపిస్తున్నాడు. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఓ దేవుడి విగ్రహం దొంగలించడానికి రెండు గ్రూపుల మధ్య జరిగే స్టోరీలాగా ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
జీవితంలో బాగా డబ్బు సంపాదించేయాలన్న లక్ష్యంతో దొంగగా మారి సులువుగా ఆ పని చేయాలనుకునే యువకుడి పాత్రలో ఆనంద్ దేవరకొండ నటించాడు. గణేషుడి విగ్రహం చోరీ కథ ఏమవుతుంది? ఈ మూవీలో హీరో అనుకున్నట్లే బాగా డబ్బు సంపాదిస్తాడా అన్నది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో అతనిపాతు ప్రగతి శ్రీవాస్తవ, ఎమ్మాన్యుయెల్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్ లాంటి వాళ్లు నటించారు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు.
గం గం గణేశా గురించి..
గం గం గణేశా మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగానే పది రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ మధ్య మల్లారెడ్డి కాలేజీకి వెళ్లిన మూవీ టీమ్.. అక్కడ పిచ్చిగా నచ్చేశావె అనే పాటను లాంచ్ చేశారు. నిజానికి ఈ మూవీ టీజర్ నాలుగు నెలల ముందే జనవరిలోనే వచ్చింది.
సాంగ్ రిలీజ్ సందర్భంగా మూవీ డైరెక్టర్ ఉదయ్ మాట్లాడాడు. "గం గం గణేశా ఒక మంచి క్రైమ్ కామెడీ మూవీ. మీరు మీ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. మా మూవీని మిస్ కాకండి" అని డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్న ఉదయ్ శెట్టి చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు సినిమా ట్రైలర్ అయితే చాలా ఆసక్తికరంగానే సాగింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లో 2019లో దొరసాని మూవీతో వచ్చాడు ఆనంద్ దేవరకొండ. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు.
పుష్పక విమానం, హైవే, బేబిలాంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు గం గం గణేశా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతని కెరీర్లో చెప్పుకోదగిన హిట్ అంటే బేబి అనే చెప్పాలి. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ కూడా నటించారు. ఆ తర్వాత వస్తున్న సినిమా కావడంతో గం గం గణేశాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.