Amy Jackson: కొడుకు పుట్టిన నాలుగేళ్ల తర్వాత పెళ్లిపీటలెక్కనున్న కోలీవుడ్ హీరోయిన్ - ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్
Amy Jackson: రామ్‌చరణ్ ఎవడులో హీరోయిన్‌గా నటించిన అమీజాక్సన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నది. ప్రియుడు, హాలీవుడ్ వెస్ట్‌విక్‌తో అమీజాక్సన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అమీజాక్సన్, వెస్ట్‌విక్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Amy Jackson: రోబో 2.ఓ హీరోయిన్ అమీజాక్సన్ త్వరలోనే ప్రియుడితో పెళ్లిపీటలెక్కబోతున్నది. హాలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎడ్ వెస్ట్‌విక్‌తో అమీజాక్సన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అమీ జాక్సన్‌కు వెస్ట్‌విక్ ప్రపోజ్ చేసి రింగ్ తొడిగాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ టూర్‌లో ఉన్నారు ఈ జంట. సినిమా స్టైల్‌లో మంచు కొండల్లోని ఓ బ్రిడ్జ్‌పై అమీ జాక్సన్‌కు ప్రపోజ్ చేశాడు వెస్ట్‌విక్.
ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఫిబ్రవరిలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
పనయోట్టుతో ప్రేమ...బ్రేకప్...
కాగా అమీజాక్సన్ గతంలో ఆండ్రెస్ పనయోట్టు అనే బిజినెన్‌మెన్‌తో ప్రేమలో పడ్డది. 2019లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. పెళ్లి కాకుండానే తల్లయింది అమీజాక్సన్. పెళ్లిపీటలెక్కకుండానే వీరి బంధానికి ముగింపు పడింది. 2022లో పనయోట్టుతో తన బంధం ముగిసినట్లుగా అమీజాక్సన్ ప్రకటించింది.
అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, జ్ఞాపకాల్ని తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలేట్ చేసింది. ఆ తర్వాత వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఆస్కార్ విన్నర్ ఆల్ఫాన్సో క్యురాన్ దర్శకత్వంలో రూపొందిన చిల్డ్రన్ ఆఫ్ మెన్ సినిమాతో వెస్ట్‌విక్ నటుడిగా మారాడు. బ్రేకింగ్ అండ్ ఎంటరింగ్, రోమియో అండ్ జూలియట్‌తో పాటు హాలీవుడ్‌లో పలు సినిమాలు చేశాడు. అమెరికన్ వెబ్ సిరీస్ గాసిప్ గర్ల్ నటుడిగా వెస్ట్‌విక్‌కు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది.
అమీజాక్సన్....
మరోవైపు అమీజాక్సన్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆర్య హీరోగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన మదరాసిపట్టణం సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అమీజాక్సన్. ఆ తర్వాత విక్రమ్‌తో శివతాండవం మూవీ చేసింది. 2014లో రామ్‌చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో గ్లామర్ రోల్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది అమీజాక్సన్.
ఎవడు మినహా తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా మారింది. ధనుష్ తంగమాగన్, విజయ్ తేరీతో పాటు రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన రోబో 2.0లో అమీజాక్సన్ నటించింది. రోబో 2.ఓలో రోబోగా కనిపించింది.
2024లో రీఎంట్రీ....
పనయోట్టుతో రిలేషన్‌షిప్‌తో పాటు వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అమీజాక్సన్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మిషన్ చాఫ్టర్ 1తో తిరిగి కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మదరాసి పట్టణంతో తనను దర్శకుడిగా పరిచయం చేసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్ మూవీతోనే కోలీవుడ్‌లోకి తిరిగి అడుగుపెట్టింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మిషన్ చాఫ్టర్ వన్ మిక్స్‌డ్ టాక్‌ను తె చ్చుకున్నది. ప్రస్తుతం హిందీలో క్రాక్ అనే మూవీ చేస్తోంది. విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. ఈ మూవీ హిట్టయితేనే అమీజాక్సన్‌కు మరిన్ని అవకాశాలు వచ్చేలా కనిపిస్తోన్నాయి. క్రాక్‌లో అమీజాక్సన్‌తో పాటు నోరా ఫతేహి మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నది.