Abbabba OTT: ఈ సినిమా టైటిలే.. అబ్బబ్బ...కామెడీ మాత్రం మామూలుగా ఉండదు - ఏ ఓటీటీలో చూడాలంటే?
Abbabba OTT: కన్నడ మూవీ అబ్బబ్బ ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ కామెడీ మూవీలో లిఖిత్ శెట్టి, అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటించారు.
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్...
అబ్బబ్బ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు 79 రూపాయలు చెల్లించాల్సివుంటుంది. మే 17 నుంచి అబ్బబ్బ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం.
లిఖిత్ శెట్టి హీరో...
అబ్బబ్బ మూవీలో లిఖిత్ శెట్టి, అమృత అయ్యంగార్, అనూష రాజ్ హీరోహీరోయిన్లుగా నటించారు. హారర్ కామెడీ కథాంశంతో దర్శకుడు కేయం చైతన్య ఈ మూవీని తెరకెక్కించాడు.
అబ్బబ్బ మూవీ కథ ఇదే...
షర్మిల (అనూషరాజ్) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు కార్తిక్ (లిఖిత్ శెట్టి). కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా షర్మిలకు మరో అబ్బాయితో పెళ్లి ఫిక్సవుతుంది. కార్తిక్, షర్మిలలను కలుపుతానని అఖిల (అమృత అయ్యంగార్) మాటిస్తుంది. అయితే తనను కార్తిక్ ఉంటున్న బాయ్స్ హాస్టల్‌లోకి తీసుకెళ్లాలని కండీషన్ పెడుతుంది. అఖిల ఆ కండీషన్ ఎందుకు పెట్టింది. బాయ్స్ హాస్టల్‌లో అడుగుపెట్టిన అఖిలకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? హాస్టల్ వార్డెన్‌తో పాటు అందులో ఉంటున్నవారు అఖిలను దయ్యమని అనుకోవడానికి కారణం ఏమిటి అనే అంశాలతో అబ్బబ్బ మూవీ సాగింది.
మలయాళ రీమేక్...
హాస్టల్ కామెడీతో పాటు హారర్ అంశాలతో దర్శకుడు చైతన్య అబ్బబ్బ మూవీతో భయపెడుతూనే నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఐఎండీబీలో ఈ సినిమాకు 10కి 9.5 రేటింగ్‌ను దక్కించుకున్నది. కాగా అబ్బబ్బ మలయాళ మూవీ రీమేక్ కావడం గమనార్హం. 2015లో మలయాళంలో విజయవంతమైన అది కాప్యారే కూటమణి ఆధారంగా అబ్బబ్బ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు చైతన్య.
తమిళంలో కూడా...
మలయాళ మూవీలో ధ్యాన్ శ్రీనివాసణ్, నమితా ప్రమోద్ హీరోహీరోయిన్లుగా నటించారు. తమిళంలో హాస్టల్ పేరుతో ఈ మూవీ రీమేకైంది. తమిళ రీమేక్‌లో అశోక్ సెల్వన్, ప్రియా భవానీ శంకర్ జంటగా కనిపించారు.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో..
కన్నడంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో చక్కటి విజయాల్ని అందుకుంటోంది అమృత అయ్యంగార్. ఆమె హీరోయిన్‌గా నటించిన లవ్ మాక్‌టెయిల్, లవ్ మాక్ టెయిల్ 2తో పాటు గురుదేవ్ హోయాసాలా కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.