Amitabh Bachchan: రూ.83 కోట్లకు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్న మెగాస్టార్.. నాలుగేళ్లలోనే రెండున్నర రెట్ల లాభం
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్నాడు. నాలుగేళ్ల కిందటే దీనిని కొన్న బిగ్ బీకి.. ఇప్పుడు ఏకంగా రూ.52 కోట్ల లాభం రావడం విశేషం. గతంలో ఇదే అపార్ట్‌మెంట్లో కృతి సనన్ అద్దెకు ఉండేది.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ముంబైలోని అంధేరీలో ఉన్న తన అపార్ట్‌మెంట్ అమ్మేశాడు. 5185 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ను అతడు ఏకంగా రూ.83 కోట్లకు అమ్మడం విశేషం. 2021లో అతడు ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయగా.. నాలుగేళ్లలోపే ఏకంగా రెండున్నర రెట్ల లాభం అతనికి వచ్చింది. ముంబైలోని జుహులో ఇప్పటికే బిగ్ బీకి రెండు ఇళ్లు ఉన్న విషయం తెలిసిందే.

అమితాబ్‌కు రూ.52 కోట్ల లాభం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక్క ప్రాపర్టీ అమ్మడం ద్వారా భారీగా లాభం మూటగట్టుకున్నాడు. ముంబైలోని అంధేరీలో అతడు ఏప్రిల్, 2021లో ఓ 5185 చదరపు అడుగుల డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొన్నాడు. ది అట్లాంటిస్ అనే పేరు గల భవనంలోని 27, 28వ అంతస్తుల్లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది.
అప్పట్లో దీనిని కేవలం రూ.31 కోట్లకు కొన్నాడు. అయితే నాలుగేళ్ల లోపే దీనిని రూ.83 కోట్లకు అమ్ముకొని.. ఏకంగా రూ.52 కోట్ల లాభం ఆర్జించాడు. జనవరి 17న ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషనల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు కోసం ఏకంగా రూ.4.98 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ అపార్ట్‌మెంట్ కు ఆరు కారు పార్కింగ్ స్పేసెస్ ఉండటం విశేషం.
విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొన్నట్లు డాక్యుమెంట్లు చూస్తే తెలుస్తోంది. ఈ ప్రాపర్టీ అమ్మడం ద్వారా బిగ్ బీకి 168 శాతం లాభం వచ్చినట్లు స్క్వేర్ యార్డ్స్ ప్రకారం తేలింది. ఇదే అపార్ట్‌మెంట్ ను గతంలో ఆదిపురుష్ నటి కృతి సనన్ కు నెలకు రూ.10 లక్షల అద్దెకు బిగ్ బీ ఇచ్చినట్లు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి.
భారీగా పెట్టుబడులు
అమితాబ్ బచ్చన్, అతని కుటుంబ సభ్యులు కొన్నేళ్లు రియల్ ఎస్టేట్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2020 నుంచి 2024 మధ్యే ఏకంగా రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. 2024లోనే రూ.100 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలను బిగ్ బీ కుటుంబం కొనుగోలు చేసింది. వాటిని తర్వాత భారీ లాభాలకు అమ్మేస్తోంది. ఒక్క అపార్ట్‌మెంట్ ద్వారానే బిగ్ బీ రూ.52 కోట్లు ఆర్జించాడంటే వాళ్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.