Amitabh Bachchan: అదీ అమితాబ్ అంటే!.. యువ దర్శకుడిని ‘సర్’ అంటూ..
Amitabh Bachchan: సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో అడుగుపెట్టనున్న తొలి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్ కే చరిత్ర సృష్టించనుంది. ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
Amitabh Bachchan: బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత గ్రేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్. 1970 నాటి నుంచి దశాబ్దాల పాటు అగ్ర హీరోగా వెలుగొందారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 80ఏళ్ల వయసులోనూ యాక్టివ్‍గా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని ఘనతలు, మరెన్నో అవార్డులు సాధించినా అమితాబ్ బచ్చన్ మాత్రం ఎప్పుడూ సాధారణంగానే ఉండాలనుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. యువ నటులు, దర్శకులను కూడా చాలా గౌరవిస్తారు. ఇలాంటిదే మరోసారి జరిగింది. యువ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్‍ను ఆయన సర్ అని సంబోధించడం అభిమానులను మనసులను గెలుచుకుంటోంది. అమితాబ్ అంటే అదీ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వివరాలివే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కే’ చిత్రం ప్రతిష్టాత్మక సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో భాగం కానుంది. ఈ ఈవెంట్‍లో పాల్గొననున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. ప్రాజెక్ట్ కే సినిమాను నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనికి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఇది తనకు చాలా గర్వకారణంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ మూవీ ఇంత అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని ముందుగా అంచనా వేయలేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‍లోనే ప్రాజెక్ట్ కే డైరెక్టర్ నాగ్ అశ్విన్‍ను సర్ అంటూ ఆయన సంబోధించారు.
“నాకు ఇది గర్వించదగ్గ విషయం. ఇది ఇంత భారీగా అవుతుందని, ఇంత ఇంపార్టెంట్ అవుతుందని నేను ఊహించలేదు. ఇప్పుడు తెలిసివచ్చింది. వైజయంతి మూవీస్‍కు, నాగ్ (నాగ్ అశ్విన్) సర్‌కు, మొత్తం యూనిట్‍కు నా శుభాకాంక్షలు. ఇంత ప్రేమను చూపిన, అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌లో నన్ను భాగం చేసిన అందరికీ ధన్యవాదాలు” అని అమితాబ్ ట్వీట్ చేశారు.
తన కెరీర్‌లో వందలాది భారీ హిట్‍లను హీరోగా సాధించారు అమితాబ్ బచ్చన్. చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేశారు. గొప్ప డైరెక్టర్లతో పని చేశారు. అయినా, యువ దర్శకుడైన నాగ్ అశ్విన్‍ను సర్ అని ఆయన సంబోధించడం అభిమానుల మనసులను గెలుచుకుంది. ఎంత ఎదిగినా ఆయన ఒదిగి ఉంటారని, అది ఆయన గొప్పతనం అని కామెంట్స్ చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ కే సినిమాను గ్లోబల్ మూవీగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‍తో పాటు సీనియర్ స్టార్ కమల్ హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీపికా పదుకొణ్, దిశా పఠానీ సహా మరికొందరు పాపులర్ యాక్టర్స్ నటిస్తున్నారు.
సాన్ డిగో కామిక్ కాన్ 2023 ఈవెంట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో జూలై 20 నుంచి 23 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‍లో ప్రాజెక్ట్ కేను చిత్ర యూనిట్ అధికారికంగా లాంచ్ చేసి.. అఫీషియల్ టైటిల్‍ను వెల్లడించనుంది. అలాగే ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేస్తుందని తెలుస్తోంది. ప్రభాస్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ సహా మరికొందరు సాన్ డిగో ఈవెంట్‍కు వెళతారని తెలుస్తోంది.