Allu Arjun: అల్లు అర్జున్‌కు నేను కూడా పెద్ద అభిమానినే.. కానీ నన్ను అతనితో పోల్చొద్దు: అమితాబ్ కామెంట్స్ వైరల్
Allu Arjun: అల్లు అర్జున్ కు తాను కూడా పెద్ద అభిమానినే అని, అయితే తనను మాత్రం అతనితో పోల్చొద్దని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనడం గమనార్హం. కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో ఓ కంటెస్టెంట్ ఇద్దరినీ పోలుస్తూ మాట్లాడటంపై బిగ్ బీ ఈ కామెంట్స్ చేశాడు.
Allu Arjun: అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియాలోనూ పెద్ద స్టార్ హీరో. అతడు నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుండటంతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అతనికి తాను వీరాభిమానినని చెప్పుకోవడం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపించిన బిగ్ బీ.. తాజాగా తాను హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతిలో మరోసారి అలాంటి కామెంట్సే చేశాడు.
అల్లు అర్జున్‌తో పోల్చొద్దు
అల్లు అర్జున్ కు తాను కూడా అభిమానిని అని చెబుతూనే.. అతనితో తనను పోల్చొద్దని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశాడు. ఈ కేబీసీ షోకి కోల్‌కతా నుంచి రజనీ బార్నివాల్ అనే మహిళ వచ్చింది. తాను అల్లు అర్జున్ తోపాటు అమితాబ్ కు కూడా వీరాభిమానినని చెప్పుకుంది. దీనికి అమితాబ్ నవ్వుతూ.. తన పేరు ఇప్పుడు చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదని అన్నాడు. అయినా కూడా మీ ఇద్దరంటే చాలా ఇష్టమంటూ ఆమె మరోసారి చెప్పింది.
దీనికి బిగ్ బీ స్పందిస్తూ.. "అల్లు అర్జున్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. అతనికి వచ్చిన గుర్తింపుకు పూర్తి అర్హుడు. నేను కూడా అతనికి వీరాభిమానిని. ఈ మధ్యే అతని సినిమా రిలీజైంది. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే చూడండి. కానీ నన్ను మాత్రం అతనితో పోల్చకండి" అని అమితాబ్ అన్నాడు.
అయినా కూడా ఆ మహిళ మాత్రం.. మీ ఇద్దరి స్టైల్స్, కామెడీ సీన్స్ చేసే సమయంలో వ్యవహరించే తీరు ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చింది. కామెడీ సీన్లలో మీ ఇద్దరూ కాలర్ ను కొరుకుతూ, కళ్లు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బీ అడగడంతో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో చేశారని తెలిపింది. ఇక ఇద్దరి గళాల్లోనూ ఓ రిచ్‌నెస్ ఉంటుందని, అమితాబ్ ను కలవడం వల్ల ఓ కల నెరవేరగా.. అల్లు అర్జున్ ను కలవాల్సి ఉందని చెప్పింది.
అల్లు అర్జున్‌పై అమితాబ్
అల్లు అర్జున్ ను అమితాబ్ ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. పుష్ప 1 మూవీ గురించి గతంలో మాట్లాడుతూ.. "ఆ సినిమా ఎంత బాగుంది కదా? అతని నటన అద్భుతం. నా జీవితంలో తొలిసారి ఓ చెప్పు జారిపోవడం అనేది కూడా ఇంత వైరల్ అవడం చూస్తున్నాను. డ్యాన్సింగ్ లో అలా జరిగింది" అంటూ శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పు గురించి అమితాబ్ చెప్పాడు.
ఇక ఈ మధ్యే పుష్ప 2 ప్రమోషన్లలో బన్నీ కూడా తనకు బాలీవుడ్ లో అత్యంత స్ఫూర్తిదాయకమైన నటుడు అమితాబే అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిని బిగ్ బీ.. తాను కూడా అల్లు అర్జున్ కు పెద్ద అభిమానిని అని అన్నాడు. దీనికి బన్నీ మరోసారి స్పందిస్తూ.. అమితాబ్ కు థ్యాంక్స్ చెప్పాడు.