అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. యాడ్ల మోత మోగనుంది.. యాడ్స్ వద్దంటే ఏం చేయాలంటే!-amazon prime video ott to play ads in movies and web series launched ad free subscription plans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. యాడ్ల మోత మోగనుంది.. యాడ్స్ వద్దంటే ఏం చేయాలంటే!

అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. యాడ్ల మోత మోగనుంది.. యాడ్స్ వద్దంటే ఏం చేయాలంటే!

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ యాడ్‍లను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. యాడ్స్ స్టార్టింగ్ తేదీని కూడా ప్రకటించింది. యాడ్స్ రాకుండా ఉండాలంటే అదనపు ప్లాన్‍లను కూడా అందుబాటులోకి తెచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. యాడ్ల మోత మోగనుంది.. యాడ్స్ వద్దంటే ఏం చేయాలంటే! (AP)

ఏదైనా సినిమానో, వెబ్ సిరీసో ఆసక్తిగా చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్ వస్తే చిరాకు వేస్తుంది. దృష్టి పక్కకు మళ్లుతుంది. ప్రస్తుతం ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా ప్రేక్షకులు కంటెంట్ చూశారు. అయితే, ఇక ప్రైమ్ వీడియోలోనూ యాడ్స్ మోత మోగనుంది. ఆ ఇబ్బంది ఎదురుకానుంది. యాడ్స్ ప్రసారం చేయడం గురించి ఆ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది.

యాడ్స్ మొదలు ఎప్పుడంటే..

జూన్ 17వ తేదీ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‍ల మధ్యలో యాడ్లను ప్రదర్శించనుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మరిం మంచి కంటెంట్‍ను తీసుకొచ్చేందుకు, అందుకోసం మెరుగ్గా పెట్టుబడి పెట్టేందుకు ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం తమకు సాయపడుతుందంటూ రాసుకొచ్చింది. ఇతర స్ట్రీమింగ్ సర్వీసులు, ఇతర ప్లాట్‍ఫామ్‍ల కన్నా అర్థవంతమైన తక్కువ యాడ్స్ ఇస్తామంటూ ప్రకటించింది.

యాడ్స్ రాకూడదంటే అదనంగా..

యాడ్ ఫ్రీ యాడ్ ఆన్ ఆప్షన్లను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రవేశపెడుతోంది. అంటే ఇప్పటి ఉన్న సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍కు అదనంగా ఈ యాడ్ ఆన్ తీసుకుంటే యాడ్స్ రావు. యాడ్ ఫ్రీ ప్లాన్‍ ధర నెలకు రూ.129, సంవత్సరానికి రూ.699గా తీసుకొచ్చింది ప్రైమ్ వీడియో.

అంటే రూ.1,499 పెట్టి సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్కిప్షన్ తీసుకున్న వారు.. యాడ్స్ రాకూడదంటే అదనంగా రూ.699 యాడ్ ఆన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెలకు యాడ్స్ రాకూడదంటే రూ.129 చెల్లించాలి. ఒకవేళ యాడ్ ఆన్ ప్లాన్ తీసుకోకుంటే జూన్ 17 నుంచి కంటెంట్ మధ్య ప్రకటనలు చూడాల్సిందే. ఈ యాడ్ ఫ్రీ ప్లాన్స్ అదే రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి.

అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడా సహా కొన్ని దేశాల్లో గతంలోనే యాడ్లను ప్రదర్శించడం అమెజాన్ ప్రైమ్ వీడియో మొదలుపెట్టింది. ఇప్పుడు ఇండియాలోనూ షూరూ చేయనుంది. సబ్‍స్క్రిప్షన్స్ నుంచి వచ్చే ఆదాయం అనుకున్న స్థాయిలో పెరగకపోవటం, పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి రావడం, నష్టాలు పెరిగిపోతుండడంతో ఈ విధానం పాటిస్తోంది. యాడ్స్ ద్వారా కూడా ఆదాయం పొందుతోంది.

ఇండియాలో ప్రస్తుతం ప్లాన్‍లు ఇలా..

అమెజాన్ ప్రైమ్ వీడియో నెల సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ ధర ఇండియాలో ప్రస్తుతం రూ.299గా ఉంది. మూడు నెలల క్వార్టర్లీ ప్లాన్ ధర రూ.599గా ఉంది. సంవత్సరం సబ్‍స్క్రిప్షన్ రేటు రూ.1,499గా ఉంది. మొబైల్ ఓన్లీ ప్లాన్ సంవత్సరానికి రూ.599గా ఉంది. ఈ ప్లాన్‍లలో యాడ్స్ రాకూడదంటే జూన్ 27 నుంచి అదనంగా యాడ్ ఆన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇండియాలో ఇప్పటికే జియోహాట్‍స్టార్, జీ5, సోనీలివ్ సహా మరిన్ని ఓటీటీల్లో యాడ్స్ వస్తున్నాయి. అధిక ధరతో యాడ్ ఫ్రీ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైమ్ వీడియో కూడా యాడ్స్ తీసుకొస్తోంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం