ఓటీటీ వచ్చిన తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ నే నమ్ముకొని ప్రేక్షకులను అలరించే మూవీస్ వస్తున్నాయి. అలాంటిదే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ (Crazxy) మూవీ కూడా. ఈ సినిమా మొత్తం దాదాపు ఒకే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ.. ఒకే కారులో సాగిపోయే షూటింగ్ అంటే నమ్మగలరా?
సినిమాలో 90 శాతం వరకు కనిపించేది ఒకే ఒక్క పాత్ర. ఓ కారులోనే సాగిపోయే కథనం.. 93 నిమిషాల్లోనే ముగిసే సినిమా. కానీ ఈ మూవీ క్లైమ్యాక్స్ కు చేరుకునే సమయానికి ప్రేక్షకుడికి కావాల్సిన దాని కంటే ఎక్కువ థ్రిల్లే వస్తుంది. క్రేజీ అనే టైటిల్ కు తగినట్లుగానే ఈ మూవీ కూడా పిచ్చెక్కిస్తుంది. రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.11 కోట్లు వసూలు చేసింది.
ఇదేమంత గొప్ప వసూళ్లు కాకపోవచ్చు. కానీ ఓ మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ క్రేజీ అలాంటి థ్రిల్ అందిస్తుంది. ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది.
క్రేజీ మూవీని గిరీష్ కోహ్లి డైరెక్ట్ చేశాడు. మహారాణి వెబ్ సిరీస్ ఫేమ్ సోహమ్ షా నటించాడు. ఈ సినిమాలో దాదాపు అతని ఒక్క క్యారెక్టరే మనకు కనిపిస్తుంది. టిన్నూ ఆనంద్, నిమిషా సజయన్ లాంటి వాళ్ల పాత్రలు కూడా ఉన్నా.. అవి చాలా వరకు ఫోన్ కాల్స్ లో డైలాగులకే పరిమితమవుతాయి. డాక్టర్ అభిమన్యు సూద్ అనే పాత్రలో సోహమ్ కనిపించాడు.
అనుకోని పరిస్థితుల్లో తాను సర్జరీ చేసిన పేషెంట్ చనిపోవడంతో ఆ పేషెంట్ తరఫు బంధువులతో రూ.5 కోట్లకు డీల్ సెట్ చేసుకుంటాడు. ఆ రూ.5 కోట్లు తీసుకొని తన కారులో అతడు బయలుదేరుతాడు. అయితే అప్పుడే తన కూతురిని కిడ్నాప్ చేశామని, రూ.5 కోట్లు ఇచ్చి తీసుకెళ్లాలన్న కాల్ వస్తుంది. తన కారులో రూ.5 కోట్ల గురించి తెలిసిన వ్యక్తులు కావాలనే అలా చేస్తున్నారని మొదట్లో అతడు లైట్ తీసుకుంటాడు.
కానీ తర్వాత అది నిజమైన కిడ్నాపే అని తేలుతుంది. ఈ క్రమంలో అతని మాజీ భార్య, ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్, తన బాధిత పేషెంట్ తరఫు వాళ్లు, హాస్పిటల్ ఎమర్జెన్సీ కేసులు, వీటన్నింటి మధ్య కిడ్నాపర్.. ఇలా వరుస ఫోన్ కాల్స్ తో అతడు సతమతమవుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు తన కూతురిని ఎలా విడిపించుకుంటాడు? క్లైమ్యాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ ఏంటి? అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
క్రేజీ మూవీ దాదాపు ఒకే పాత్ర, ఒకే కారు చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ క్రమంలో వచ్చే సీన్స్ మంచి థ్రిల్ పంచుతాయి. ముఖ్యంగా తన మాజీ భార్య, ప్రేయసి, పేషెంట్ తరఫు బంధువులు, కిడ్నాపర్ లాంటి వాళ్ల నుంచి వరుస కాల్స్, వాళ్ల నుంచి వచ్చే ఒత్తిళ్ల మధ్యలోనూ.. ఓ వీడియో కాల్ ద్వారా తన జూనియర్ కు సూచనలు ఇస్తూ ఓ సంక్లిష్టమైన సర్జరీని ఆ డాక్టర్ చేయించే సీన్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పొచ్చు.
డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న తన కూతురిని ఒకప్పుడు అసహ్యించుకున్న అదే తండ్రి.. ఆమె నిజంగానే కిడ్నాప్ అయిందని తెలుసుకొని ఆమెను విడిపించుకోవడానికి పడే తపన ఆడియెన్స్ ను భావోద్వేగానికి గురి చేస్తుంది. మొత్తంగా క్రేజీ అనే టైటిల్ తో, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా.. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునేవారు మిస్ కాకుండా చూడాల్సిందే.
సంబంధిత కథనం