Dubbing Movies: అమరన్ ప్రాఫిట్స్ పదిహేను కోట్లు - తెలుగు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోన్న డబ్బింగ్ సినిమాలు
Dubbing Movies: ఈ ఏడాది రిలీజైన డబ్బింగ్ సినిమాలు తెలుగు నిర్మాతలకు కోట్లలో లాభాల్ని తెచ్చిపెట్టాయి. అమరన్, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ తో పాటు పలు సినిమాలు స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను రాబట్టాయి. ఈ ఏడాది ఎక్కువ లాభాల్ని తెచ్చిపెట్టిన డబ్బింగ్ సినిమా ఏదంటే
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ నిర్మాతలకు లాభాలను పంటను పండించాయి. ఎలాంటి అంచనాలకు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళం, మలయాళ డబ్బింగ్ మూవీస్ కోట్లలో వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచాయి.
అమరన్, మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలుతో పాటు మరికొన్ని సినిమాలు లాభాలను తెచ్చిపెట్టగా...రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలు మాత్రం నష్టాలను మిగిల్చాయి.
అమరన్ లాభాల పంట....
శివకార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. అమరన్ తెలుగు వెర్షన్ పదిహేను రోజుల్లో 35 కోట్లకుపైగా గ్రాస్ , 20 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది తెలుగులో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన డబ్బింగ్ మూవీగా నిలిచింది.
స్ట్రెయిట్ సినిమాకు ధీటుగా తెలుగులో ప్రమోషన్స్ చేయడం, సాయిపల్లవికి ఉన్న క్రేజ్ అమరన్‌కు తెలుగులో బాగా కలిసివచ్చింది. కేవలం ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు పదిహేను కోట్లు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. రాజ్‌కుమార్ పెరియాసామీ దర్శకత్వం వహించిన ఈ మూవీని కమల్‌హాసన్ ప్రొడ్యూస్ చేశాడు.
ప్రేమలు 17 కోట్లు...
మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రొడ్యూస్ చేసిన ప్రేమలు మూవీని రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశాడు. మమితాబైజు, నస్లీన్ జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ తెలుగులో 17 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఐదు కోట్లకు కార్తికేయ ఈ సినిమా డబ్బింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా అతడికి 12 కోట్ల వరకు ప్రేమలు తెలుగు వెర్షన్ లాభాల్ని మిగిల్చినట్లు తెలిసింది. మరో మలయాళం లో బడ్జెట్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ కూడా తెలుగులో నిర్మాతలకు భారీగా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా ఏకంగా పది కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది.
మహారాజ ట్రెండ్ సెట్టర్...
విజయ్ సేతుపతి మహారాజా జీరో బజ్‌తో రిలీజై ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు పెట్టిన దాని కంటే నాలుగు కోట్లు ఎక్కువే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది.
ఈ ఏడాది ధనుష్ రాయన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇందులో రాయన్ హిట్‌గా నిలవగా కెప్టెన్ మిల్లర్ నష్టాలను మిగిల్చింది. డీమోంటీ కాలనీ 2 తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్నది.
స్టార్ హీరోలు మాత్రం....
ఈ ఏడాది రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్ వంటి స్టార్ హీరోలు నటించిన డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. కమల్ హాసన్ ఇండియన్ 2, రజనీకాంత్ వేట్టయన్, లాల్ సలామ్, దళపతి విజయ్ ది గోట్ సినిమాల డబ్బింగ్ హక్కులను భారీ ధరలకు నిర్మాతలు సొంతం చేసుకున్నారు. కానీ పేలవమైన కథ, కథనాల కారణంగా నిర్మాతలకు ఈ సినిమాలు నష్టాలను మిగిల్చాయి. విక్రమ్ తంగలాన్ కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ దక్కించుకోలేకపోయింది.