TRP Ratings: కల్కిని బీట్ చేసిన అమరన్ తెలుగు వెర్షన్.. అంచనాలకు మించి టీఆర్పీ.. లక్కీ భాస్కర్ కూడా అదుర్స్
TRP Ratings: అమరన్ సినిమా తెలుగులో మంచి టీఆర్పీ రేటింగ్ సాధించింది. అంచనాలను మించేసింది. లక్కీ భాస్కర్ చిత్రం కూడా భారీ టీఆర్పీతో దుమ్మురేపేసింది. ఆ వివరాలు ఇవే..

ఓటీటీల హవా పెరిగిపోయాక.. టీవీ ఛానెళ్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో కొన్నిసార్లు భారీ చిత్రాలకు కూడా టీఆర్పీ తక్కువగా వస్తోంది. థియేటర్లు, ఓటీటీల్లో చాలా మంది అప్పటికే చూసేయడం లాంటి కారణాలతో కొన్ని బ్లాక్‍బస్టర్ చిత్రాలు కూడా టీవీల్లో సరిగా పర్ఫార్మ్ చేయలేదు. అయితే, తమిళ మూవీ ‘అమరన్’ తెలుగు వెర్షన్ టీవీల్లో అద్భుతమైన స్పందన దక్కించుకుంది. శివకార్తీకేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీవీల్లో దుమ్మురేపింది. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కూడా మంచి రేటింగ్ సాధించింది.
అమరన్ చిత్రానికి అంచనాలకు మించి..
అమరన్ చిత్రం తెలుగులో జనవరి 26వ తేదీన సాయంత్రం స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం అయింది. స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోవటంతో ఈ చిత్రానికి టీఆర్పీపై అంతగా హైప్ లేదు. తెలుగులో థియేటర్లలో మంచి కలెక్షన్లే దక్కించుకున్నా.. టీవీల్లో ఎంత మంది చూస్తారనే సందేహం నెలకొంది. అయితే, అంచనాలను ఈ చిత్రం తలకిందులు చేసేసింది. తాజా టీఆర్పీ రేటింగ్ వెల్లడి కాగా.. ఊహలకు మించి రేటింగ్ దక్కినట్టు వెల్లడైంది.
కల్కి కంటే ఎక్కువ
అమరన్ తెలుగు వెర్షన్‍కు తొలి టెలికాస్ట్‌లో స్టార్ మా ఛానెల్‍లో ఏకంగా 9.1 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇటీవల కొన్ని తెలుగు బ్లాక్‍బస్టర్ చిత్రాల కంటే.. ఈ తమిళ డబ్బింగ్ మూవీకే ఎక్కువ రేటింగ్ దక్కింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‍బస్టర్ మూవీ కల్కి చిత్రానికి టీవీలో ఫస్ట్ టెలికాస్ట్ సమయంలో జీ తెలుగులో 5.26 టీఆర్పీనే నమోదైంది. ఈ చిత్రానికి అంత తక్కువ రావడం చాలా మంది ఆశ్చర్యపరిచింది. అయితే, థియేటర్లలో ఎక్కువ మంది చూడడం, ఓటీటీలోనూ భారీ వ్యూస్ దక్కించుకోవడంతో టీవీలో కల్కికి పెద్దగా టీఆర్పీ రాలేదనే వాదనలు ఉన్నాయి.
మొత్తంగా కల్కి చిత్రం కంటే ఎక్కువ టీఆర్పీని అమరన్ సొంతం చేసుకుంది. అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంపై తమిళంలో అమరన్ చిత్రం రూపొందింది. దీపావళి సందర్భంగా గతేడాది అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజైంది. శివకార్తికేయన్, సాయిపల్లవి నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‍బస్టర్ అయింది. మొత్తంగా రూ.330కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సత్తాచాటింది. ఈ చిత్రానికి రాజ్‍కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
లక్కీ భాస్కర్ హవా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తెలుగు మూవీ లక్కీ భాస్కర్ కూడా బ్లాక్‍బస్టర్ అయింది. రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకొని దుమ్మురేపింది. ఈ సినిమా గత నెల జనవరి 19వ తేదీన స్టార్ మా ఛానెల్‍లో తొలిసారి ప్రసారం అయింది. ఈ మూవీకి ఏకంగా 10.2 టీఆర్పీ రేటింగ్ సొంతమైంది. మంచి టీఆర్పీ దక్కుతుందని ఈ మూవీకి అంచనాలు ఉండగా.. దాన్ని నిలబెట్టుకుంది.
లక్కీ భాస్కర్ చిత్రం గతేడాది అక్టోబర్ 31వ తేదీనే థియేటర్లో విడుదలైంది. బ్యాంకును మోసం చేసి ఎదిగే ఓ ఉద్యోగి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. దుల్కర్ యాక్టింగ్‍తో మెప్పించారు. ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో భారీ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు టీవీలోనూ 10కి పైగా టీఆర్పీతో సత్తాచాటింది.
సంబంధిత కథనం