Amaran OTT: అమరన్ మూవీలో ఆ సీన్‌ను బ్లర్ చేసిన చిత్రయూనిట్.. నెల రోజుల వివాదానికి తెర
Amaran OTT: అమరన్ మూవీలో యూత్‌కి బాగా కనెక్ట్ అయిన ఒక లవ్ సీన్‌లో చిత్ర యూనిట్ బ్లర్ వేసింది. ఈ సీన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఇంజినీరింగ్ స్టూడెంట్ మద్రాసు హైకోర్టు ఆశ్రయించడంతో బ్లర్ వేసి చిత్రయూనిట్ నష్టనివారణ చర్యలకి దిగింది.
తమిళ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ.. ఇన్నాళ్లు థియేటర్లలో.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ ఆధారంగా ఈ మూవీని రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించారు.
ఓటీటీలో అమరన్ జోరు
అక్టోబరు 31న రిలీజైన అమరన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది. గత వారం నుంచి ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
సాయి పల్లవి ఫోన్ నెంబరు అనుకుని
అమరన్ మూవీ రిలీజైన వారం తర్వాత ఈ సినిమాలోని ఒక సీన్‌పై వివాదం మొదలైంది. మూవీలో ఒక సీన్‌లో భాగంగా ఇందు రెబెకా వర్గీస్ (సాయి పల్లవి) తన మొబైల్ నెంబరుని పేపర్‌పై రాసి ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) పైకి విసురుతుంది. పేపర్‌పై రాసిన ఆ నెంబరును చూసి వెంటనే ముకుంద్ కాల్ చేస్తాడు. సినిమాలో ఈ లవ్ సీన్ బాగా యూత్‌కి కనెక్ట్ అయ్యింది. కానీ.. చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి విఘ్నేశన్‌కి ఇది తలనొప్పిగా మారింది. దానికి కారణం ఏంటంటే..? సాయి పల్లవి రాసిన మొబైల్ నెంబరు.. ఈ విఘ్నేశన్‌దే.
రూ.1.1 కోట్లు పరిహారానికి డిమాండ్
అమరన్ మూవీలో చూపించిన ఫోన్ నెంబరు నిజంగానే సాయి పల్లవిదే అనుకుని భ్రమించిన చాలా మంది అభిమానులు.. ఆ నెంబరుకి కాల్స్, మెసేజ్‌లు చేశారట. దాంతో.. మూవీ రిలీజైన రోజుల వ్యవధిలోనే తనకి దాదాపు 4వేల కాల్స్ వచ్చాయని ఆరోపించిన విఘ్నేశన్.. తాను అనుభవించిన మానసిక క్షోభకి అమరన్ చిత్రం నిర్మాణ సంస్థ నుంచి రూ.1.1 కోట్లు పరిహారం ఇప్పించాలని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు. వాస్తవానికి విఘ్నేశన్ కోర్టుని ఆశ్రయించక ముందే.. అమరన్ టీమ్‌కి లీగల్ నోటీసులు కూడా పంపాడు. కానీ.. పట్టించుకోకపోవడంతో కోర్టుని ఆశ్రయించాడు.
ఈ సీన్‌లో నెంబరు బ్లర్
ఈ కేసుపై కోర్టు విచారణ జరుగుతుండగానే.. అమరన్ చిత్రయూనిట్ నష్ట నివారణ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అమరన్‌లో.. ఆ మొబైల్ నెంబరు సీన్‌లోని నంబరు కనబడకుండా బ్లర్ చేశారు. అలానే యూట్యూబ్‌లో ఆ సీన్ ఉన్న సాంగ్‌లో కూడా బ్లర్ చేశారు. దాంతో.. వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లు అయ్యింది. మరి మద్రాస్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.