భార్య అల్లు స్నేహారెడ్డికి విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. క్యూటీ అంటూ లవ్లీ నోట్
Allu Arjun - Allu Sneha Reddy Wedding Anniversary: తన భార్య అల్లు స్నేహా రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్. తమ వివాహ వార్షికోత్సవం రోజున ఆమె గురించి ఎమోషనల్‍గా పోస్ట్ చేశారు.
Allu Arjun - Allu Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి నేడు (మార్చి 6) తమ 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తమ అన్యూన్య బంధంలో మరో మైలురాయిని చేరుకున్నారు. సంతోషంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో తన భార్య స్నేహా రెడ్డికి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు అల్లు అర్జున్. అందమైన మాటలతో తన జీవిత భాగస్వామికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు.
తన ఎదుగుదలకు కారణమయ్యావంటూ సోషల్ మీడియా వేదికగా భార్య స్నేహ రెడ్డికి విషెస్ చెప్పారు అల్లు అర్జున్. పెళ్లి ఫొటోతో పాటు లవ్లీ నోట్ రాశారు. “హ్యాపీ యానివర్సరీ క్యూటీ. ఇప్పటికి 13 ఏళ్లు అయ్యాయి. నీ తోడు కారణంగా నేను ఎదిగాను. నీ ప్రశాంతత నుంచి నేను శక్తిని పొందుతున్నాను. కాలం ముగిసే వరకు ఇలాంటివి చాలా చాలా రావాలి” అని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.
లవ్ స్టోరీ.. పెళ్లి
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి.. ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లిలో తొలిసారి కలుసుకున్నారు. మొదటి పరిచయంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించారు. 2010 నవంబర్ 26న వీరి ఎంగేజ్‍మెంట్ జరిగింది. ఆ తర్వాత 2011 మార్చి 6వ తేదీన హైదరాబాద్‍లోనే అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహం గ్రాండ్‍గా జరిగింది.
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకు 2014 ఏప్రిల్‍లో కుమారుడు అల్లు అయాన్ జన్మించారు. 2016లో నవంబర్ 21న కుమార్తె అల్లు ఆర్హ జన్మించారు. అల్లు అర్జున్ ఎప్పుడు సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. షూటింగ్‍లు లేని సమయంలో ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‍కు వెళుతుంటారు. కుటుంబానికే తాను ఎక్కువ ప్రాధాన్యమిస్తానని చాలాసార్లు ఐకాన్ స్టార్ చెప్పారు.
జోరుగా పుష్ప 2
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2021లో రిలీజై తెలుగుతో హిందీలోనూ బ్లాక్ బస్టర్ అయిన పుష్పకు సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 మూవీపై బజ్ విపరీతంగా ఉంది.
పుష్ప 2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో షూటింగ్ శరవేగంగం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో నెలలో పుష్ప 2 షూటింగ్ పూర్తయ్యేలా మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.
పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఇటీవలే ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో పుష్ప 1 ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా జర్మనీలో జరిగిన ఆ ఫిల్మ్ ఫెస్టివల్‍కు అల్లు అర్జున్ వెళ్లారు. గ్లోబల్ మీడియాతోనూ ముచ్చటించారు.