Allu Arjun New Year wishes: ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Allu Arjun New Year 2024 wishes: కొత్త సంవత్సరం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది (2023) ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ వివరాలివే..
Allu Arjun New Year 2024 wishes: 2023 సంవత్సరం నేటితో (డిసెంబర్ 31) ముగియనుంది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాది 2024 అడుగుపెట్టనుంది. ఈ తరుణంలో చాలా మంది ప్రముఖులు కొత్త సంవత్సరం శుభాకాంక్షలను తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2023లో తమ జ్ఞాపకాలను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఈ ఏడాదికి సంతోషంగా వీడ్కోలు చెప్పారు.
అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే.. 2023 తనకు అందమైన ముఖ్యమైన పాఠాలను నేర్పిందని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. 2023కు వీడ్కోలు పలుకుతూ ట్వీట్ చేశారు.
“2023లో నా ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. చాలా రకాలుగా ఇది ఒక అద్భుతమైన సంవత్సరం. నేను చాలా అందమైన ముఖ్యమైన పాఠాలను నేర్చుకున్నా. ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అందమైన ఈ 2023 సంవత్సరానికి ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు పలుకుతున్నా. సంతోషకమైన సంవత్సరం. హ్యాపీ న్యూఇయర్ 2024” అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
జాతీయ అవార్డు ఈ ఏడాదే
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అల్లు అర్జున్ ఈ ఏడాదే (2023) అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్న తొలి టాలీవుడ్ యాక్టర్‌గా చరిత్ర సృష్టించారు. దీంతో 2023 అల్లు అర్జున్ కెరీర్లో చాలా ముఖ్యమైన సంవత్సరంగా నిలిచిపోయింది. 2021లో వచ్చిన ‘పుష్ప 1: ది రైజ్’ చిత్రానికి గాను ఐకాన్ స్టార్‌కు నేషనల్ అవార్డ్ వచ్చింది.
పుష్ప 2లో బిజీబిజీ
పుష్ప సినిమా బంపర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ రేంజ్ స్థాయికి అల్లు అర్జున్ చేరుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్‍గా పుష్ప 2: ది రూల్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతోంది. 2023 అంతా పుష్ప 2 షూటింగ్‍లోనే బిజీబిజీగా గడిపారు అల్లు అర్జున్. ఇంకా చిత్రీకరణ కాస్త మిగిలే ఉంది. 2024 ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ కానుంది.