Pushpa 2: బాహుబలి 2తో పోలిస్తే ఆ విషయంలో పుష్ప 2 సినిమా 40 శాతం తక్కువే!
Pushpa 2 The Rule: పుష్ప 2 చిత్రం కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే, ఓ విషయంలో మాత్రం బాహుబలితో పోలిస్తే ఇంకా 40 శాతం తక్కువగానే ఉంది. ఆ వివరాలివే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1,800కోట్ల మార్కును ఈ మూవీ దాటేసింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్లలో రూ.1440 కోట్ల మార్క్ అధిగమించింది. దీంతో భారత్‍లో గ్రాస్ విషయంలో బాహుబలి 2 (రూ.1416.9 కోట్ల గ్రాస్)ను దాటేసింది. టాప్ ప్లేస్‍కు వచ్చింది. కానీ, ఫుట్ ఫాల్స్ విషయంలో బాహుబలి 2తో పోలిస్తే పుష్ప 2 ఇంకా సుమారు 40 శాతం తక్కువగానే ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బాహుబలి 2 vs పుష్ప 2 ఫుట్‍ఫాల్స్
సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను ఫుట్‍ఫాల్స్ అంటూ లెక్కిస్తారు. ఐఎండీబీ లెక్కల ప్రకారం, బాహుబలి 2 చిత్రానికి సుమారు 10.77 కోట్ల ఫుట్ ఫాల్స్ వచ్చాయి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‍లో ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ ఆ రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అయింది. కాగా, పుష్ప 2 సినిమాకు ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల ఫుట్‍ఫాల్స్ నమోదయ్యాయి. ఇంకా కొన్ని రోజులు థియేట్రికల్ రన్ కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా ఫుట్ ఫాల్స్ విషయంలో బాహుబలి 2తో పోలిస్తే పుష్ప 2.. 40 శాతం తక్కువగానే ఉండనుందని అర్థమవుతోంది.
ఫుట్ ఫాల్స్ విషయంలో ఇండియాలో టాప్ ప్లేస్‍లో ఉంది అమితాబ్ బచ్చన్ ‘షోలే’ (సుమారు 15 కోట్ల ఫుట్‍ఫాల్స్). ఆ తర్వాత రెండో స్థానంలో బాహుబలి 2 నిలిచింది. ఈ జాబితాలో ప్రస్తుతం పుష్ప 2 తొమ్మిదో ప్లేస్‍లో ఉంది. మూడో స్థానంలో బాలీవుడ్ క్లాసిక్ మోఘల్ ఈ ఆజం మూవీ కొనసాగుతోంది.
ఇండియాలో టాప్ ప్లేస్
ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్న మూవీగా పుష్ప 2 అగ్రస్థానానికి దూసుకొచ్చింది. సినిమా ప్రేక్షకులను మెప్పించటంతో పాటు అధిక టికెట్ రేట్లు బాగా కలిసి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి భారత్‍లో ఒక్కటే రూ.1,443 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రెండో ప్లేస్‍లో బాహుబలి 2 ఉంది. పుష్ప 2 ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్‍గా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో రెండో ప్లేస్‍కు పుష్ప 2 చేరింది. తొలి స్థానంలో రూ.2వేల కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ ఉంది. దంగల్ చిత్రానికి ఇండియాలో రూ.535 కోట్లే రాగా.. చైనాలోనే అత్యధికంగా కలెక్షన్లు దక్కించుకుంది. రూ.1,810 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్‍తో బాహుబలి 2 మూడో స్థానానికి వెళ్లింది.
పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో సెన్సేషన్ హిట్ అయిన పుష్ప సీక్వెల్‍గా ఈ మూవీ 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టు దుమ్మురేపుతోంది. హిందీ నెట్ కలెక్షన్ల విషయంలోనూ ఆల్‍టైమ్ హిట్‍గా పుష్ప 2 చరిత్ర సృష్టించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా చేశారు.
సంబంధిత కథనం
టాపిక్