పుష్ప 2 మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 18 వందల కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ త్రీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
పుష్ప 2 తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అమెరికాలోనే ఫేమస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ ప్రతినిధులతో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ ముచ్చటిస్తోన్న ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతోనే మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
వీఎఫ్ఎక్స్‌కు ప్రాధాన్యమున్న మూవీ ఇదని, ఇందులో అల్లు అర్జున్ ప్రోస్థటిక్ మేకప్‌తో కనిపిస్తారని, అతడి లుక్, మేకోవర్ గత సినిమాలకు భిన్నంగా ఉండబోతున్నట్లు రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
కాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ అట్లీ బుధవారం హైదరాబాద్ వచ్చారు. అట్లీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. అల్లు అర్జున్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే అట్లీ హైదరాబాద్ వచ్చినట్లు చెబుతోన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నట్లు సమాచారం.
ఈ భారీ బడ్జెట్ మూవీలో అల్లు అర్జున్ రోల్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. పాజిటివ్‌తో పాటు నెగెటివ్ రోల్స్‌తో అల్లు అర్జున్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఒక్కో క్యారెక్టర్ లుక్ ఒక్కోలా ఉండేలా అట్లీ డిజైన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇతర భాషలకు చెందిన స్టార్ ఈ మూవీలో గెస్ట్ పాత్రలు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
అట్లీ మూవీ కోసం ముగ్గురు కథానాయికలతో అల్లు అర్జున్ రొమాన్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 22వ మూవీ ఇది.
అట్లీ మూవీ తర్వాత త్రివిక్రమ్, సందీప్ వంగాలతో సినిమాలు చేయనున్నాడు అల్లు అర్జున్. పుష్ప 3 కూడా ఉంటుందని ఇటీవలే అల్లు అర్జున్‌తో పాటు సుకుమార్ అనౌన్స్‌చేశారు.
సంబంధిత కథనం