Allu Arjun Wax Statue: ఈ ఇద్దరిలో అసలు అల్లు అర్జున్ ఎవరో గుర్తు పట్టగలరా? మైనపు బొమ్మ లాంచ్
Allu Arjun Wax Statue: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్ లో కొలువుదీరింది. దీనిని బన్నీయే ఆవిష్కరించి.. దానితో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Allu Arjun Wax Statue: పైన ఉన్న ఫొటోలు అసలు అల్లు అర్జున్ ఎవరో గుర్తు పట్టారా? సెలబ్రిటీల మైనపు బొమ్మలను అచ్చు గుద్దినట్లుగా తీర్చిదిద్దే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తాజాగా మన ఐకాన్ స్టార్ బొమ్మను కూడా ఏర్పాటు చేసింది. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న బన్నీ.. దుబాయ్ లోని ఈ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించాడు.
అల్లు అర్జున్‌తో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యే తన భార్య స్నేహ, పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించడానికి వెళ్తున్నాడని తేలింది. ఇక గురువారం (మార్చి 29) దీనిని అల్లు అర్జునే ఆవిష్కరించాడు. పుష్ప మూవీతో నేషనల్ అవార్డు గెలిచిన ఈ స్టార్.. తన బొమ్మ పక్కన అదే పోజులో నిల్చొని ఫొటో దిగాడు.
దీనిని తన సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేశాడు. "మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మ లాంచ్ లో నేను. ప్రతి నటుడికీ ఇదొక మైలురాయి సందర్భమే" అనే క్యాప్షన్ తో అల్లు అర్జున్ ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో చూసిన తర్వాత అసలు బన్నీ ఎవరు? మైనపు బొమ్మ ఏది అని తేల్చుకోవడం కాస్త కష్టమే. అంతలా ఈ బొమ్మను తీర్చిదిద్దారు. ఇక మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు బొమ్మ ఉన్న తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలిచాడు. గతేడాదే అతని బొమ్మను ఆవిష్కరిస్తున్నట్లు ఈ మ్యూజియం వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత అతని వ్యాక్స్ స్టాచూ సిద్ధమైంది.
అల్లు అర్జున్ మూవీస్
ఈ లాంచ్ తర్వాత అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ వచ్చిన పుష్ప 2 మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. అంతేకాదు ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలాంటి డైరెక్టర్లతో అతడు సినిమాలు చేయనుండటం విశేషం. ప్రస్తుతానికి పుష్ప 2 మూవీ రిలీజ్ కోసం అతడు వేచి చూస్తున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ మధ్యే అల్లు అర్జున్‍ను ఓ వీర అభిమాని హైదరాబాద్‍లో నేడు కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చారు. ఐకాన్ స్టార్ చేతులను పట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు. అతడిని ఆప్యాయంగా పట్టుకొని ఓదార్చారు అల్లు అర్జున్. తన అభిమానితో ప్రేమగా మాట్లాడారు. అతడు చెప్పిన విషయాలను ఓపిగ్గా విన్నారు. ఆ తర్వాత తన ఫ్యాన్‍తో కలిసి ఫొటోలు దిగారు.
అల్లు అర్జున్ కలిసిన సమయంలో అభిమాని ఎమోషనల్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. లక్కీ ఫ్యాన్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అమితంగా అభిమానించే నటుడిని కలిసినప్పుడు ఎమోషనల్ అవడం సహజమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్‍ను అంత ఆప్యాయంగా పలకరించిన అల్లు అర్జున్‍ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఐకాన్ స్టార్ మనసు మంచిదంటూ కొందరు రాసుకొస్తున్నారు.